ఇక నాగబాబు పేరు చివర..
Nagababu: తెలుగుదేశం పార్టీ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడం దాదాపుగా ఖాయమైనట్టే. ఇప్పటికే ఆయన తమ్ముడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నాగబాబు సహా టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన అయిదు మంది కూడా ఏకగ్రీవంగా శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఆర్ వనిత రాణి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కొణిదెల నాగేంద్ర బాబు (నాగబాబు- జనసేన), బీద రవిచంద్ర (టీడీపీ), బీ తిరుమల నాయుడు, కావలి గ్రీష్మ ప్రసాద్ (టీడీపీ), సోము వీర్రాజు (బీజేపీ) ఉన్నారు. గడువు ముగిసే సమయానికి ఈ అయిదుమంది మినహా మరెవరూ నామినేషన్లను దాఖలు చేయలేదు. ఫలితంగా పోటీ లేకుండా వారంతా మండలికి ఎన్నికయ్యారు.

షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే- నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈ నెల 10. 11వ తేదీన నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు. ఈ అయిదింటికీ మించి మరే నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం ఏకగ్రీవ ఎన్నికకు దారి తీసింది.
జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు పదవి కాలం ఈ నెల 29వ తేదీతో ముగియాల్సి రావడం వల్ల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. శాసన సభలో ఇప్పుడున్న బలాన్ని బట్టి చూస్తే ఈ అయిదు కూడా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఖాతాలోకే వెళ్తాయంటూ ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి.
కాగా- ఈ మధ్యాహ్నం నాగబాబు.. జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశం అయ్యారు. మర్యాదపూరకంగా ఈ భేటీ సాగింది. శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో బాలినేని.. నాగబాబుకు అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications