బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి: రాయలసీమలో వర్షాలు
Heavy rains: ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి నేడు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
బుధవారం నాటికే ఈ ఉపరితల ఆవర్తనం బలపడింది. ప్రస్తుతం రాయలసీమ, పరిసర ప్రాంతాలకు ఇది విస్తరించింది. సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఇది కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు- అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమ పరిధిలోకి వచ్చే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని చెప్పారు. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications