భయం-నిర్భయం: ఏపీలో ముద్రగడ అలా, తెలంగాణలో కోదండరాం ఇలా
హైదరాబాద్/విజయవాడ: ఏపీలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, తెలంగాణలో జేఏసీ చైర్మన్ కోదండరాంలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్నారు. కాపు ఉద్యమం కోసం ముద్రగడ విపక్షాల మద్దతు కూడగట్టారు. కోదండకు తెలంగాణలో విపక్షాల మద్దతు లభిస్తోంది.
విభజన అనంతరం ఏపీలో బలమైన ప్రతిపక్షం ఏర్పడింది. వైసిపి అధినేత జగన్ పలుమార్లు చంద్రబాబు ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ఆయనను చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ వల్ల కూడా చంద్రబాబు ఒకింత ఇరుకున పడి, ఆ తర్వాత బయటపడ్డారు.
కానీ, ముద్రగడ పద్మనాభం మాత్రం ఆయనను వరుసగా చిక్కుల్లో పెడుతున్నారు. కాపుల కోసం ఏమైనా చేస్తానని ప్రతిన పూనుతున్నారు. మరోవైపు, తెలంగాణలో విపక్షాలకు స్థానమే లేకుండా పోయింది. ప్రజలు అధికార పార్టీని తప్ప విపక్షాలను పట్టించుకోని పరిస్థితి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా, ఇప్పుడు కోదండరాం తెరపైకి వచ్చారు. తద్వారా తెలంగాణలో ఇన్నాళ్లు ఎదురులేదనుకున్న తెరాస ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రజల కోసం తాము ప్రభుత్వం పైన పోరాడటానికే సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటింజచారు.

తద్వారా, ఇప్పుడు ఏపీలో ముద్రగడ, తెలంగాణలో కోదండరాం పేరు బాగా వినిపిస్తోంది. ఇద్దరూ వేర్వేరు సమస్యపై మాట్లాడుతున్నప్పటికీ వారి పోరాటం మాత్రం ప్రభుత్వాల మీదనే కావడంతో వారికీ ప్రభుత్వాలకి మద్య మాటల యుద్ధం నడుస్తోంది.
ముద్రగడకి నేరుగా ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు కానీ ప్రతిపక్ష నేతలు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణాలో మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు కోదండరాంకి అండగా నిలబడుతుండటం గమనార్హం.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ చేస్తున్న పోరాడటం తప్పు కాదు, చట్ట వ్యతిరేకం అంతకంటే కాదు, కానీ కులసమీకరణాలు, ఓటు బ్యాంకు లెక్కల కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆయన పోరాటంలో నేరుగా పాలు పంచుకోవడానికి వెనుకాడుతున్నాయని చెప్పవచ్చు.
ముద్రగడతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసిపి చెబుతుండగా, ఆయన కూడా తన వెనుక వైసిపి లేదని చెబుతున్నారు. కానీ ముద్రగడ.. జగన్‌కు సీక్రెట్ ఏజెంట్ అని టిడిపి ఆరోపిస్తోంది. టిడిపి నేతల ఆరోపణలను దూరం చేసేందుకు ఆయన కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులను, కాపు ముఖ్యులను కలిశారు.
తెలంగాణాలో టీఆర్ఎస్ నేతలు కూడా కోదండరాం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని వాదిస్తున్నారు కానీ, ఆయన మాత్రం తన వెనుక ఎవరూ లేరని, ప్రజలు మాత్రం తమ వెనుక ఉన్నారని చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నాయి. కోదండరాం మాత్రం రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్నారనే చెప్పవచ్చు.
వారిరువురూ ఓ అంశంతోనే ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టినప్పటికీ.. వారిలో ముద్రగడ తన లక్ష్యానికి కొంచెం దూరం అయినట్లు కనిపిస్తున్నారని అంటున్నారు.
పైగా తుని విద్వంసం, ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ లేఖలు వ్రాయడం, మళ్ళీ ఇప్పుడు తుని విద్వంసానికి కారకులుగా అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘ విద్రోహ శక్తులని తక్షణమే విడిచిపెట్టాలని కోరుతూ కిర్లంపూడిలో దీక్షకు కూర్చోవడం వంటి అనేక కారణాల వలన, ఆయన విమర్శలు మూటగట్టుకుంటున్నారని అంటున్నారు.
ఒకప్పుడు ఆయనకి భయపడిన ప్రభుత్వం, ఇప్పుడు ఇదే కారణాల చేత ఆయనపై చాలా నిర్భయంగా విమర్శలు, ఆరోపణలు చేస్తోంది.
తెలంగాణాలో టీఆర్ఎస్ మంత్రులు, నేతలు కూడా కోదండరాంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ప్రజలు, ప్రతిపక్షాలు, విద్యా, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే, ఉద్యమంలో పాల్గొనని నేతలు కూడా కోదండరాంను విమర్శించడమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications