ముద్రగడ దీక్ష టెన్షన్, ఆఫర్ అంటూ ప్రకటన: టిడిపి నేతల ఎదురుదాడి
కాకినాడ: తనకు ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇస్తామని అధికార తెలుగుదేశం పార్టీ ఆశచూపుతోందని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తన డిమాండ్లపై గురువారం సాయంత్రంలోగా రాతపూర్వకమైన హామీ రాకపోతే శుక్రవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
ముద్రగడ పద్మనాభం ప్రకటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ఎదురుదాడికి దిగారు. మళ్లీ నిరాహార దీక్ష చేస్తాననడం రాజకీయ లబ్ధి కోసమా, సామాజిక లబ్ధి కోసమా అన్నది మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పి.నారాయణ, మృణాళిని, ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సూచించారు.
కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, కొత్త బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్ల కేటాయింపు ఉంటుందని వారు చెప్పారు. ఏలూరులో కాపు రుణమేళా పెట్టి రూ.192 కోట్లు ఇచ్చారని, ఇతర చోట్లా రుణమేళాలు పెడుతున్నారని వారన్నారు. సీఎం ప్రతి ఒక్కటీ చేస్తున్నారని, తామంతా ఉన్నామని ఆయన చెప్పారు.

కాపులకు రిజర్వేషన్లు వచ్చి తీరతాయని, అయినా దీక్ష ఎందుకు? ఆలోచించి దీక్ష విరమిస్తే కాపులకు న్యాయం జరుగుతుందని ముద్రగడనుద్దేశించి వారన్నారు. ఫిబ్రవరిలో దీక్ష చేసి, మళ్లీ ఇప్పుడు దీక్ష అంటే అర్థమేంటని ప్రశ్నించారు. కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారమిక్కడ మంత్రుల నివాసగృహాల్లో సమావేశమయ్యారు.
ఆ తర్వాత చినరాజప్ప, నారాయణ, కళా వెంకట్రావు, మృణాళిని, త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. 'కాపులను బీసీల్లో చేరుస్తామని గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పాం. శాసనసభలో చెప్పినా సరిపోదు, లేఖ మాత్రమే కావాలని ముద్రగడ అంటే ఎలా? కాపు రిజర్వేషన్లు సామాజిక అంశం. దీనికి రాజకీయ కోణం జోడించి 10-15 రోజుల్లో చేయాలంటే ఎలా? కాపు రిజర్వేషన్ హామీని వైఎస్ రాజశేఖరరెడ్డి రెండుసార్లు విస్మరిస్తే ఎవరూ ప్రశ్నించలేదు' వారన్నారు.
'అలాంటిది ఆయన పేరుతో పెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తుని ఘటనలో వేలుపెట్టి విధ్వంసం చేశారు. రిజర్వేషన్‌పై చంద్రబాబు పాదయాత్ర సందర్భంగానే కాపులకు నమ్మకం వచ్చింది. అదే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తొంది. చంద్రబాబు మాట మీద నిలబడి బీసీ కమిషన్ వేశారు. కాపులను బీసీల్లో చేర్చడం ఖాయం. కాపు సోదరులు, సోదరీమణులు విజ్ఞతతో ఆలోచించాలి' అని వారు చెప్పారు.
కాపులపై కక్ష ఎందుకు పెంచుకున్నారో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. కాపులకు మచ్చ తేవాలని తునిలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. లోటస్‌పాండ్ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఆడించే ప్రయత్నాన్ని జగన్ మానుకోవాలన్నారు.
ఏ పార్టీ ప్రలోభాలకు కాపు సోదరులు ఆకర్షితులు కావొద్దని ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారంనాడు విశాఖలో సూచించారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయాన్ని కాపు సోదరులు గమనించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకుల్లో నిరుద్యోగం ఎక్కువయినపుడే కాపు రిజర్వేషన్ లు గుర్తుకు వస్తాయని ఎంపీ అవంతి శ్రీనివాస్ వివరించారు.












Click it and Unblock the Notifications