నా భార్య, కోడల్ని తిట్టారు, బాబుపై పోరాటమే: ముద్రగడ కంటతడి
రాజమహేంద్రవరం: పోలీసుల తీరు పైన ముద్రగడ పద్మనాభం మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును లాఠీలతో కొడుతూ తీసుకెళ్లారని, రాయలేని తిట్లను ఉపయోగించారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్యను, కోడలిని బండబూతులు తిట్టారన్నారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మాట్లాడారు.
ఎంతోమందికి అన్నదానం చేసిన తన కుటుంబానికి తీరని అవమానం జరిగిందన్నారు. నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే మూడు గంటలలోపే పోలీసులు తలుపులు పగులగొట్టుకొని లోపలకు వచ్చారని, తనను మర్యాదగానే తీసుకెళ్లినా, తన భార్య రెక్కలు పట్టుకొని తిడుతూ తీసుకెళ్లి బస్సులో పారేశారని కన్నీటిపర్యంతమయ్యారు.
తన కోడలిని, బావమరిది భార్యను, తన కొడుకును కూడా తిడుతూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారన్నారు. కొడితే దిక్కెవడురా అంటూ నానా తిట్లు తిట్టారన్నారు. మన పరిపాలన ఇలా ఉందని, ముఖ్యమంత్రి పాలనలో ఇది కూడా ఓ భాగంగానే భావిస్తున్నామన్నారు.

మాట్లాడేందుకు కూడా తనకు ఓపిక లేదని, ఉద్యమం విషయం అందరికీ తెలుసునని, ఆ సందర్భంలో కేసుల విషయంలో లోతైన దర్యాఫ్తు చేస్తే తప్ప అరెస్టుల పర్వం ప్రారంభించమని ఇచ్చిన వాగ్ధానాన్ని పక్కన పెట్టారని, మేమూ ముద్దాయిలమే అరెస్టడు చేసుకోమని ఏడో తేదీన పోలీస్ స్టేషన్ వెళ్లానని చెప్పారు.
తొమ్మిదో తేదీన టీవీలో 69 కేసులు తన పైన పెట్టారని విన్నానని, అదనపు ఎస్పీ తనను అరెస్టు చేయడానికి వచ్చారని, సమన్లు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పించమంటే ఏవీ లేవని అవమానించడానికే వచ్చినట్లుగా ప్రవర్తించారని, మీరంతా చూస్తారన్న ఉద్దేశ్యంతో మీడియాను బయటకు పంపి, తలుపులు పగలగొటడ్టి లోపలకు ప్రవేశించారన్నారు.
సాధారణంగా దీక్ష ప్రారంభించిన నాలుగు, ఐదో రోజు పరిస్థితి తీవ్రంగా ఉంటే అలా చేయడం పద్ధతి కానీ, మొదటి రోజే, అదీ మూడు నాలుగు గంటలకే తలుపులు పగలగొట్టారంటే కక్ష సాధించేందుకే అన్నట్లుగా ఉందన్నారు. కానిస్టేబుల్ మొదలు డిజీపీ వరకు ఎంతోమంది ఆఫీసర్లకు తన చేత్తో కాఫీ ఇచ్చానని, టిఫిన్, భోజనాలు పెట్టానని, వాళ్ల ఎంగిలి ఆకులు కూడా తీసిన రోజులు ఉన్నాయన్నారు.

ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది తన ఇంట్లో భోజనాలు చేశారని, పోలీస్ స్టేషన్లో ఫంక్షన్ ఉందంటే వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చేవాళ్లమని, అలా అన్నదానం చేసిన తన ఊరి ప్రజానీకానికి, కొద్దో గొప్పో అన్నం పెట్టిన తన చేతులు నరికారని, అన్నదానం చేయడం తప్పని చెప్పినట్లయిందన్నారు.
అన్న పెట్టిన మనిషిని కొట్టడం, తిటడ్టడం విడ్డూరమన్నారు. కుటుంబాన్ని బూతులు తిట్టించుకునే దౌర్భాగ్యం తనకు మిగిలిందన్నారు. అయినా పోలీసు వాళ్ల పట్ల తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఎవరి మీదా చర్యలు కోరుకోవడం లేదన్నారు.
ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికి ఇలాంటి అవమానం జరిగి ఉండకపోవచ్చునని, తన తండ్రి ఎమ్మెల్యేగా పని చేశారని, నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాననన్నారు. అయినా ఇలా అవమానించడం ఏమిటన్నారు.
ముద్రగడ ప్రతిన
ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. అప్పటి వరకు తన ఇంట్లో ఏ పండుగ చేసుకోమని, ఇప్పుడు తన శరీరంలో రక్తం లేదని, పౌరుఖషం, పట్టుదల లేవని, సెలైన్ నీరు ఉందన్నారు.

చెప్పుకో కొట్టినా..
ఎవరైనా దారిలో వెళ్తూ చెప్పుతో కొట్టినా నోరు విప్పలేని పరిస్థితులో ఉన్నానని చెప్పారు. ఎవరినీ ఏమీ చేయలేని అల్పుడిని అని, అనాధని అని భావిస్తున్నానని, పోరాడే శక్తి కోల్పోయానని, కొంచెం ఊపిరి ఉందని, దానిని జాతి కోసం, తనను నమ్ముకున్న ఇతరుల కోసం ఉపయోగిస్తానన్నారు.
ఇంత అవమానం జరిగినా, మరింత పోరాడాలని ఉందన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదలకూడదని కోరుతున్నానని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అడుగుతున్నానని, మరేమీ అడగడం లేదన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలంటే ముఖ్యమంత్రికి ఎందుకు కోపమొస్తుందో అన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాదిలా...
తనను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారని, సెల్ ఫోను, టీవీ కూడా అందుబాటులో లేకుండా చేశారన్నారు. సెంట్రల్ జైలులో ఉన్న మనిషికి పేపర్ అయినా ఇస్తారని, తనకు అది కూడా ఇవ్వలేదన్నారు. తనను బూటు కాలుతో తన్నినా బాధపడనని, రిజర్వేషన్లు ఇస్తే చాలునని చెప్పారు.

తన వల్ల తన సోదరులు, బంధువులు, అభిమానులు ఎంతో అవమానపడ్డారన్నారు. అందరికీ తలవంచి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది పెద్ద నాయకులు సంఘీభావం ప్రకటించారని చెబితే విన్నానని, అందుకే పేరుపేరునా పాదాభివందనాలు అన్నారు.












Click it and Unblock the Notifications