మరోసారి రోడ్డెక్కనివ్వొద్దు, నిద్రపోనివ్వం: చంద్రబాబుకు ముద్రగడ హెచ్చరిక
తూర్పుగోదావరి: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఆ వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు.
లేఖను ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు తన పోరాటం ఆపనని ముద్రగడ ఆ లేఖలో స్పష్టం చేశారు.
హామీల అమలుపై ఎదురు దాడి చేయడం ఆపి.. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని చంద్రబాబుకు ముద్రగడ సూచించారు. రాజస్థాన్, హర్యానా మాదిరిగా శాసనసభలో తీర్మానం చేసి.. రిజర్వేషన్ల అమలు దిశగా ముందుకు వెళ్లాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు. మరోసారి తనను రోడ్డెక్కేలా మాత్రం చేయకండని.. చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

నిద్రపోనివ్వొద్దు
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఘాటుగా స్పందించారు. కాపు రిజర్వేషన్లు సాధించే వరకు మనం నిద్రపోవద్దని, సీఎం చంద్రబాబును నిద్రపోనివ్వదని తమ వర్గానికి పిలుపునిచ్చారు.
సోమవారం కూనవరం గ్రామస్తుల ఆహ్వానం మేరకు విచ్చేసిన ముద్రగడ తొలుత బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కాపు రిజర్వేషన్‌పై ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
కాపు ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులను బీసీలోకి చేర్చుతామని, ఏడాదికి రూ. 1000 కోట్లు కార్పొరేషన్‌కు మంజూరు చేస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పక్కనపెట్టారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications