మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేడే.. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నగరపాలికల్లో 118 మంది కార్పొరేటర్లు.. వివిధ మున్సిపాలిటీల్లో 756 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అలాగే దాదాపు 75 వేల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కోరారు. ఓటింగ్ శాతం గతంలో కంటే పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓటింగ్ ప్రక్రియపై ప్రతి రెండు గంటలకు ఒకసారి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు.

పోలింగ్ ముందు రోజే తాను పులివెందులకు చేరుకుంటానని మర్నాడు ఓటు వేస్తానని జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలో పులివెందులలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శాంతియుతంగా పోలింగ్ నిర్వహించడానికి అదనంగా 600 మంది పోలీసు బలగాలను పులివెందులకు రప్పించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications
