నందమూరి తారకరత్న కన్నుమూత: హైదరాబాద్‌కు భౌతికకాయం
ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. శనివారం రాత్రి 9.30గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.
బెంగళూరు: ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. శనివారం రాత్రి 9.30గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. తారకరత్నకు భార్య అలేఖ్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

తారకరత్న మరణంతో విషాదంలో నందమూరి కుటుంబం
తారకరత్న మరణంతో నందమూరి, నారా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. క్షేమంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తారని అంతా భావించగా.. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉంటూ ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు.

లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన తారకత్న
జనవరి 27న ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆ యాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కిందపడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చిత్తూరులోని పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

23 రోజులుగా ఆస్పత్రిలోని చికిత్స పొందిన తారకరత్న
అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు తమ శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. 23 రోజులుగా చికిత్స పొందిన తారకరత్నం.. శనివారం రాత్రి శివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. కాగా, బెంగళూరు ఆస్పత్రికి నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

రేపు హైదరాబాద్‌కు తారకరత్న పార్థీవ దేహం
ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. రేపు ఫిలిం ఛాంబర్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఎల్లుండి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్ మనవడిగా.. 9 సినిమాలు ప్రారంభించి తారకరత్న రికార్డు
దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ తనయుడే తారకరత్న. ఈయన 1983, ఫిబ్రవరి 22న జన్మించారు. ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్‌లో తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. 2001లో ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు తారకరత్న 23 చిత్రాల్లోనూ, ఒక వెబ్ సిరీస్‌లోనూ నటించారు. సినిమాలతోపాటు తారకరత్న రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు.












Click it and Unblock the Notifications