ఓటమి దిశగా వైసిపి: సన్యాసంపై అఖిలప్రియకు సవాల్ మీద శిల్పా ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అన్ని రౌండ్లలో దూసుకెళ్తుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఓటమిని అంగీకరించారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అన్ని రౌండ్లలో దూసుకెళ్తుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఓటమిని అంగీకరించారు.

టిడిపి గెలుపుకు ఆ రెండే కారణాలు
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కౌంటింగులో వరుసగా టిడిపి దూసుకెళ్తుండటంపై మాట్లాడుతూ.. టిడిపి అభివృద్ధితో గెలవలేదని చెప్పారు. వారు చెబుతున్న అభివృద్ధి తనకు ఎక్కడా కనిపించలేదన్నారు. సానుభూతి (భూమా చనిపోవడం, చిన్నపిల్లలు), డబ్బు పంపకం టిడిపిని గెలిపిస్తోందన్నారు.

అఖిలప్రియకు చేసిన సవాల్‌పై తిరకాసు
తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మంత్రి అఖిలప్రియ కూడా తన సవాల్ స్వీకరిస్తారా అని శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో సవాల్ విసిరారు. దీనిపై శిల్పా స్పందించారు. తన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు అఖిల చెప్పలేదని, అలాగే కౌంటింగ్ కూడా పూర్తిగా అవలేదని శిల్పా మోహన్ రెడ్డి తప్పించుకునే మాటలు మాట్లాడారు. ముస్లీంలు కూడా టిడిపి వైపు మొగ్గు చూపారని చెప్పారు.

జగన్ ఇల్లు ఇల్లు తిరిగారు కానీ: నాగమౌనిక
13 రోజులు వైసిపి అధినేత జగన్.. శిల్పా మోహన్ రెడ్డి కోసం ఇల్లు ఇల్లు తిరిగారని భూమా నాగ మౌనిక అన్నారు. తాము ఎవరికీ భయపడలేదన్నారు. ప్రజలకు మేలు చేసే కుటుంబానికే నంద్యాల ప్రజలు అండగా నిలబడ్డారని తెలిపారు.

జగన్ వ్యాఖ్యలు నష్టం చేశాయి
చంద్రబాబును కాల్చివేయాలన్న జగన్ వ్యాఖ్యలు వైసిపికి నష్టం చేకూర్చాయని భూమా నాగమౌనిక అన్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు కోసం కుటుంబం, మంత్రులు, టిడిపి కార్యకర్తలు కష్టపడ్డారని, ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు.

భూమా సిస్టర్స్‌దే కాదు.. అందరిదీ
భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు క్రెడిట్ భూమా సిస్టర్స్‌ది మాత్రమే కాదని, అందరిదీ అని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిది అన్నారు. మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా అని విలేకరులు మౌనికను ప్రశ్నించగా.. నా తల్లిదండ్రులను ప్రజల్లో బతికించుకోవడమే తన లక్ష్యమని మౌనిక చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా ఆమె నవ్వి ఊరుకున్నారు.

చంద్రబాబు నివాసం ఎదుట సంబరాలు
నంద్యాల కౌంటింగ్ ప్రారంభం నుంచి ప్రతి రౌండులో టిడిపి దూసుకెళ్తోంది.దీంతో టిడిపిలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అమరావతిలో చంద్రబాబు నివాసం ఎదుట పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం నివాసానికి చేరుకొని బాణసంచా కాల్చారు.












Click it and Unblock the Notifications