మహానాడుపై నన్నపనేని, టిలోను గెలిచామని లెక్క
హైదరాబాద్: రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మహానాడును మాత్రం కలిసే జరుపుకుందామని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి బుధవారం అన్నారు. మహానాడులో ఆమె మాట్లాడారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం మహానాడును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కాకుండా ఒకేచోట జరుపుకుందామన్నారు.
వచ్చే సంవత్సరం మహానాడును ఆంధ్రాలో పెట్టినా, తెలంగాణలో జరిపినా అందరం అక్కడికి వస్తామన్నారు. చంద్రబాబు వందలాది కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, పార్టీని విజయపథాన నడిపించారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్రను కొనసాగించారని గుర్తు చేశారు.

సీమాంధ్రలో 100 సీట్లు గెలుచుకున్నామని, తెలంగాణలో 20 సీట్లు వచ్చాయని రెండింటిని కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీదే విజయంగా భావించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు.
జాతీయస్థాయిలో కీలక పాత్ర: యనమల
జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టిడిపి ఇక జాతీయ పార్టీగా ముందుకు సాగుతుందన్నారు. మోడీ నాయకత్వంలో మంచి పని తీరుతో ముందుకు వెళ్తామన్నారు. అవినీతిని నిర్మూలించాలని, పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో పని చేస్తామన్నారు. దేశంలో బిజెపి తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన పార్టీ టిడిపియే అన్నారు.
వైఫల్యంపై జగన్ పార్టీ సమీక్ష
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఫల్యంపై సమీక్షించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతి జిల్లాకు ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. రేపటి నుంచి ఈ కమిటీలు జిల్లాల్లో తిరిగి క్షేత్ర స్థాయిలో నివేదికలు రూపొందిస్తాయి. కమిటీల నివేదికల ఆధారంగా అధినేత జగన్ జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications