Nara Lokesh : జగన్ కు లోకేష్ సవాల్- నేను తెచ్చిన కంపెనీ ఇది- ఉద్యోగులు వీరే..మరి మీరు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రావడం లేదని ఆరోపిస్తున్న టీడీపీ నేత నారా లోకేష్.. ఇవాళ దాన్ని నిరూపించేందుకు గతంలో తాము తెచ్చిన ఓ కంపెనీ బస్సు, ఉద్యోగులతో సెల్ఫీ దిగారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని టీడీపీ నిత్యం ఆరోపణలు చేస్తోంది. దీనికి వైసీపీ కూడా పలు కౌంటర్లు ఇస్తోంది. త్వరలో విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. ఓ సవాల్ విసిరారు.
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు ఓ బస్సు తారసపడింది. దీంతో దగ్గరికి వెళ్లిన ఆయనకు ఆ బస్సు డిక్సన్ కంపెనీ ఉద్యోగులదని తెలిసింది. దీంతో బస్సు ముందే సెల్పీ దిగిన లోకేష్.. ఆ తర్వాత అందులోకి ఎక్కి ఉద్యోగులతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అంతే కాదు దీన్ని సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంతకీ ఆ బస్సు ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా.. ? అది టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన డిక్సన్ కంపెనీ బస్సు, అందులో సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.

డిక్సన్ కంపెనీ బస్సు ముందు, ఉద్యోగులతో కలిసి సెల్ఫీలు దిగిన నారా లోకేష్.. సీఎం జగన్ కు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని టీడీపీ చేస్తున్న విమర్శల్ని గుర్తుచేస్తూ.. మిస్టర్ జగన్ రెడ్డీ నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు..నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా!?, ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగానని ప్రకటించగలవా" అంటూ సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దీంతో ఈ సెల్ఫీ సవాల్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications