బాబు, కేసీఆర్ బాగా చేస్తున్నారని మోడీకి చెప్పా: నరసింహన్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అనంతరం గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిలు సమర్థవంతంగా పని చేస్తున్నారని ప్రధానితో చెప్పానని, ఎలాంటి సమస్యలు లేవని తెలిపానని చెప్పారు.
రెండు రాష్ట్రాలలో శాంతిభద్రతలు బేషుగ్గా ఉన్నాయన్నారు. రొటీన్ అంశాలను చర్చించామని చెప్పారు. విభజన చట్టం అమలులో ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు లేవని చెప్పారు. అధికారుల విభజన త్వరలో పూర్తయ్యేలా చేస్తానని చెప్పారు. ఇంటర్ పరీక్షలు విడిగా జరిగినా నష్టంలేదన్నారు. ఎంసెట్ ఉమ్మడిగా జరగొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.

నాబార్డ్ రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి: హరీష్ రావు
మిషన్ కాకతీయకు నాబార్డ్ రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు శుక్రవారం హైదరాబాదులో అన్నారు. మే నెలకు 900 చెరువుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. తెలంగాణలో నా బార్డ్ ప్రాధాన్యత మారాలన్నారు. ఇరిగేషన్‌లో తెలంగాణ వెనుకబడి ఉందని చెప్పారు. రైతు ప్రయివేటు అప్పులకు వెళ్లకుండా చూడాలన్నారు. రైతులకు ఉపయోగపడేలా పంట బీమాలో మార్పులు రావాలన్నారు. కోల్డ్ స్టోరేజీ కెపాసిటీ పెరగాలన్నారు.
విభజన హామీల అమలుపై సుప్రీంలో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
విభజన చట్టంలో పేర్కొన్న పలు హామీలు ఆరు నెలల్లోపు అమలు కావాల్సి ఉన్నదని, కానీ ఇంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా, ఇరు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపుల వంటివి కేంద్రం అమలు చేయలేదని వారు పేర్కొన్నారు. పైగా, ఇరు రాష్ట్రాలకు మధ్య పలు సమస్యలు తలెత్తుతున్నాయని, విద్వేషాలు చోటు చేసుకుంటున్నాయని వారు వివరించారు.












Click it and Unblock the Notifications