ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించండి: ప్రమాదంపై బాబుకు నారాయణ బాసట
రాజమండ్రి: పుష్కరఘాట్‌లో తొక్కిసలాట ఘటన విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సిపిఐ జాతీయ నేత నారాయణ బాసటగా నిలిచారు. చంద్రబాబు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై వివాదం చేయడం తగదని నేతలకు హితవుచెప్పారు. పుష్కర ఘాట్లలో రెండు వంతెనల మధ్యలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.
తొక్కిసలాటను రాజకీయం చేస్తారా...
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శవరాజకీయాలకు అలవాటు పడ్డాయని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నేత జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. పుష్కరాల్లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి, ప్రతిపక్షాలు ఈ ఘటనను కూడా రాజకీయం చేయడం తగదన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యమే కారణం...
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని ఆయన ఢిల్లీలో అన్నారు. కుంభమేళా తరహాలో చర్యలు చేపడితే బాగుండేదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ ఇఫ్తార్‌లో చంద్రబాబు
ఈ నెల 17న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమంలో బాబు హాజరవుతారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications