నా కోసం టీడీపీ, కాంగ్రెస్‌లు పోటీ, దండం పెట్టేశా: ఆర్ నారాయణమూర్తి
హైదరాబాద్: తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పలు పార్టీలు ప్రయత్నం చేశాయని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని గతంలో టీడీపీ మూడుసార్లు కోరిందని, అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇస్తామని చెప్పిందని వెల్లడించారు.

దండం పెట్టేశా
ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొన్న కూడా ఒక పార్టీ ఆఫర్ ఇచ్చిందని తాను ఓ దండం పెట్టానని నారాయణ మూర్తి అన్నారు. రాజకీయాల్లోకి వెళితే ప్రజల కోసం 24 గంటలు పనిచేయాలని, లేకపోతే వెళ్లకూడదని అన్నారు.

సినిమాలంటే పిచ్చి..
తనకు సినిమా పిచ్చి మాత్రమే ఉందని అన్నారు. రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణించకూడదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ అప్పట్లో ఓ హిస్టరీ క్రియేట్ చేశారని అన్నారు.

ఎన్టీఆర్, వైయస్‌లే..
ఎన్టీఆర్ తరువాత అంతటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మళ్లీ వైయస్ రాజశేఖర్ రెడ్డని చెప్పారు. తమ ఊరిలో మొదటిసారి బీఏ చదివింది తానేనని ఆర్ నారాయణమూర్తి అన్నారు.

అదే నాకు భగద్గీత
తనకు కమ్యూనిజం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని చెప్పారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తనకు ఒక భగవద్గీతలా అనిపించిందని చెప్పుకొచ్చారు. గద్ధర్, వంగపండు పాటలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇంకా తన సినిమాల గురించిన విషయాలను వెల్లడించారు.


Click it and Unblock the Notifications