కర్చీఫ్‌లేశారు: 70మంది ఎమ్మెల్యేలు ఝలక్ ఇస్తారా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నుండి ఇతర పార్టీల వైపు చూస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉందంటున్నారు. పలువురు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం నేపథ్యంలో చాలామంది ప్రస్తుతానికి ఇతర పార్టీలలో చేరిక అంశాన్ని వాయిదా వేసుకుంటున్నారట.
రెండు రోజులుగా అసెంబ్లీ శాసన సభ లాబీల్లో నేతలు కిరణ్ కొత్త పార్టీ, ఇతర పార్టీలలోకి చేరికలపై జోరుగా చర్చించుకుంటున్నారు. మంత్రులు టిజి వెంకటేష్, శత్రుచర్ల విజయ రామరాజు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి కొందరు కిరణ్ కొత్త పార్టీ పెడతారని చెబుతున్నారు. ఈ నెల 23 తర్వాత ఎప్పుడైనా పార్టీ పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ద్వారా కిరణ్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది.

టిడిపి లేదా వైయస్సార్ కాంగ్రెసు లేదా కిరణ్ కొత్త పార్టీ ఏదైనా సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ త్వరలో ఖాళీ కావడం ఖాయమంటున్నారు. ఓ పార్టీలో కర్చీఫ్ వేసుకుంటూనే మరో పార్టీతో చర్చలు జరుపుతున్నారట. మరోవైపు కిరణ్ పార్టీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారంటున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం అంటే పూర్వ ప్రజారాజ్యం పార్టీ ప్రజాప్రతినిధులే పదకొండు మంది వరకు ఉన్నారట.
ముందు జాగ్రత్తగా పక్క పార్టీల్లో కర్చీఫ్ వేసుకుంటున్న అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఫిరాయింపు నిర్ణయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు 60 నుంచి 70మంది వరకు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, మరో అరడజను మంది మంత్రులు సొంత పార్టీని వీడి వెళ్లేందుకు ఇతర పార్టీలతో మంతనాలు సాగిస్తున్నారట. వాస్తవానికి వారంతా తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నప్పటికీ విభజన రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్ధంకాక వేచి చూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ప్రధానంగా విభజన ఆగిపోతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటున్న నేపథ్యంలో కూడా ఫిరాయింపులకు తాత్కాలిక బ్రేక్ పడుతున్నట్టు కనిపిస్తోంది. కొత్త పార్టీ ఖరారైతే పక్క పార్టీలోకి వెళ్లి పోవాలని భావిస్తున్న వారిలో అనేకమంది కిరణ్ పార్టీలోకి వస్తారని భావిస్తున్నారు.
ఇతర పార్టీలోకి వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్న వారిలో కొంతమందికి ఇప్పటికే టికెట్లపై హామీలు రావడంతో వెళ్లిపోయేందుకే సిద్ధమవుతున్నారట. ఇంకొంతమంది టికెట్లపై హామీలు రాకపోవడంతో వెనుకాడుతున్నారంటున్నారు. ఈ పరిస్థితిలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నామని, కిరణ్ పార్టీ ప్రకటిస్తే అప్పుడు ఏం చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తామని పలువురు ఎమ్మెల్యేలు అంటున్నారు.
మంత్రి గంటా శ్రీనివాస రావు, శత్రుచర్ల విజయరామ రాజు వంటి మంత్రులు పక్క పార్టీవైపు చూస్తున్న వారే. వారిలో గంటా శ్రీనివాస రావు తెలుగుదేశంలోకి వెళ్లిపోతున్నట్టు దాదాపు నిర్ధారణ అయిపోయింది కూడా. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తుది నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా పితాని, శత్రుచర్ల కూడా పార్టీ మార్పుపై నిర్ణయాన్ని తీసుకున్నారట.
ధర్మాన ప్రసాద రావు విషయానికి వస్తే ముందుగా వైయస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్టు ప్రచారం జరిగినా, తరువాత తెలుగుదేశంలోకి అంటూ మరో కొత్త ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం ప్రచారాన్ని ఖండించిన ఆయన శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అది పార్టీ మార్పా, పార్టీలోనే కొనసాగాలా, రాజకీయ సన్యాసమా అన్న అంశంపై ఆలోచించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications