అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!
ఏపీ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం మ్యాప్ లో సైతం భారీ మార్పులు సంభవించాయి. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ప్రభుత్వం కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతి అని స్పష్టంగా పేర్కొంది.
దీంతో పాటు కొత్త జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, పశ్చిమ గోదావరి- ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను తీసుకుని పోలవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ రెండూ కూడా కొత్త మ్యాప్ లో ఉన్నాయి. ఆయా జిల్లాల సరిహద్దులను వేరు చేస్తూ మ్యాప్ రూపుదిద్దుకుంది. అలాగే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాన్ని రాజధాని అమరావతి ప్రాంతంగా గుర్తించారు.

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి, వికేంద్రీకరించే లక్ష్యంతోనే ఈ పునర్విభజన చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. విభజన అనంతరం 13 జిల్లాల ఏపీ ఏర్పాటైంది. వైఎస్ జగన్ హయాంలో ఇది 26 జిల్లాలుగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో వీటి సంఖ్య 28 కి పెరిగింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. లోక్ సభ ఆమోదించిన సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications