వారికి నెలకు రూ.4000.. కొత్తగా పింఛన్లతో వారింట సంతోషం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ మాసం పింఛన్ పంపిణీ మొదలైంది. ఈసారి ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు అందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెప్టెంబరు నెలలో దివ్యాంగులు అందరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.61 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.
కొత్తగా వారికి పించన్ లు.. కొనసాగుతున్న పించన్ ల పంపిణీ
మొత్తం సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీకి 2746.52 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కొత్తగా స్పౌజ్ కేటగిరీ కింద 1,09,155 మందికి నెలకు 4 వేల రూపాయల చొప్పున పింఛన్ కూడా ఇస్తున్నారు. దీనికోసం కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. జియో కోఆర్డినేట్స్ నమోదు చేస్తున్న ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రయత్నిస్తోంది.

వారికీ భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం
పింఛన్ల పంపిణీలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ క్యాటగిరి లో కూడా పింఛన్ పథకాన్ని తీసుకువచ్చి 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31మధ్య పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి పింఛన్ వారి భార్యలకు బదిలీ చేసింది.
స్పౌజ్ పెన్షన్ దారులు హ్యాపీ
మొత్తంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్పౌజ్ కేటగిరి పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తూ వారికి భరోసా కల్పిస్తోంది. ఆగస్ట్ నెల నుండి వారికి 4 వేల రూపాయలను పెన్షన్ అందిస్తుంది. దీంతో సుదీర్ఘ కాలం స్పౌజ్ పెన్షన్ ల కోసం నిరీక్షించిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.
దివ్యాంగులు, హెల్త్ కేటగిరీలో అనర్హులకు నోటీసులు
ఏపీలో అనర్హులైన వారు పింఛన్లు పొందారని, ముఖ్యంగా దివ్యాంగుల, హెల్త్ కేటగిరీలో వీరంతా పింఛన్లు పొందారని పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుంచి తనిఖీలు చేపట్టి దివ్యాంగులు మరియు హెల్త్ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న వారికి పరీక్షలు నిర్వహించింది. ఇప్పటికే వీరిలో అనర్హులను గుర్తించి నోటీసులు కూడా జారీ చేసింది.
అప్పీలు చేసుకోవాలని అవకాశం
అలాగే ఎవరైనా సరే అప్పీల్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత ఎనిమిది నెలలుగా నిర్వహించిన పింఛన్ల తనిఖీలు 1.35 లక్షల మంది అనర్హులుగా తేలారు.వైద్య ఆరోగ్య శాఖ వారందరికీ నోటీసులు పంపించింది. అర్హత ఉంటేనే అప్పీలు చేసుకోవాలని సూచించింది. తమకు అర్హత ఉందని ఎవరైతే సరైన ఆధారాలతో అప్పీల్ చేసుకుంటారో, వారందరికీ పింఛన్ ఇస్తామని పేర్కొంది.
సెప్టెంబర్ లో యధావిధిగా అందరికీ పించన్ లు
అధికారులు 95 శాతం మంది అప్పీల్ చేసుకున్నారని ప్రభుత్వానికి తెలుపగా, సెప్టెంబర్ మాసానికి కూడా ఆగస్టులో ఇచ్చినట్టే పింఛన్ పంపిణీ యధావిధిగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక అనర్హులని నోటీసులు ఇచ్చిన వారి గురించి ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ మాసంలో కూడా దివ్యాంగులు అందరికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది.
రెండు రోజుల్లో అనర్హులపై నిర్ణయం
ఇక నోటీసులు అందుకున్న వారి గురించి సెర్ప్, వైద్య శాఖాధికారులు రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. ఇంకా దివ్యాంగులకు సంబంధించి దాదాపు రెండు లక్షల మందిని తనిఖీ చేయాల్సి ఉండగా, దీనిపైన కూడా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అనర్హులుగా తేలిన వారిపైన ఈ మాసంలో నిర్ణయం తీసుకోనున్న క్రమంలో వచ్చే నెలలో ఎంతమంది దివ్యాంగులకు పింఛన్ ఇస్తారు అనేది తేలనుంది.












Click it and Unblock the Notifications