నిమ్మగడ్డ ఫిక్స్.!! సీఐడీ విచారణలో కొత్త మలుపు: ఆ లేఖ తయారైంది అక్కడే..!
మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ లేఖ వ్యవహారంలో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ఉన్న సమయంలో కేంద్రానికి రాసిన లేఖ..దీని పైన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫిర్యాదు..సీఐడీ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తరువాత ఏపీ ప్రభుత్వం..ఎన్నికల కమిషనర్ మధ్య దూరం పెరిగింది. ఆ సమయంలోనే రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. అందులో ప్రస్తావించిన అంశాలు ఏపీ ప్రభుత్వ పెద్దలకు రుచించ లేదు.
Recommended Video
తొలుత తాను ఆ లేఖ రాయలేదంటూ నిమ్మగడ్డ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో..ఈ లేఖ ఎవరు రాశారో తేల్చాలంటూ సాయిరెడ్డి నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ప్రాథమిక సమాచారం సేకరించింది. నిమ్మగడ్డ పీఎస్‌ను పలు దఫాలుగా విచారించిన సీఐడీ ఇప్పుడు ఆ లేఖ బయట నుండే వచ్చిందనే నిర్ధారణకు వచ్చింది. దీంతో..ఇప్పుడు మరిన్ని ఆధారాలతో నిమ్మగడ్డను ఫిక్స్ చేసేందుకు సీఐడీ పావులు కదుపుతోంది.

నిమ్మగడ్డ లేఖ ఇష్యూలో కొత్త టర్న్...
నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ పైన సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఒక వైపు నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించటం పైన హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సీఐడీ సైతం తమ వద్దకు వచ్చిన ఫిర్యాదు పైన అనేక కోణాల్లో విచారణ చేస్తోంది.
నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆయన పీఎస్ గా పని చేసిన సాంబమూర్తిని విచారించిన సీఐడి ప్రాథమిక సమాచారం సేకరించింది. ఆయన లేఖ కు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం సీఐడీకి అందించారు. అయితే, మరింత లోతుగా చేసిన విచారణలో పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ నిర్ధారణకు వచ్చింది.

సాయిరెడ్డి అనుమానాలకు బలం చేకూర్చేలా..
18వ తేదీ ఉదయం పెన్ డ్రైవ్ ద్వారా లేఖ వచ్చిందని సీఐడి గుర్తించింది. నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు పంపిన లేఖను ముందుగానే బయట తయారు చేసి తీసుకువచ్చారని సీఐడి అంచనాకు వచ్చింది. దీని ద్వారా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి చేసిన ఫిర్యాదుకు బలం చేకూర్చే విధంగా తమ విచారణలో పలు అంశాలు బయటకు వస్తున్నాయని సీఐడి అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా ఆ లేఖ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తయారు కాలేదనే నిర్ధారణకు సీఐడి వచ్చింది.

నిమ్మగడ్డ ఫిక్స్ అయినట్లేనా...!
సీఐడీ ఇప్పటి వరకు చేసిన విచారణలో ఆ లేఖ అధికారిక కార్యాలయంలో తయారైంది కాదని తేల్చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే, తమను కార్యాలయంలోనే తయారైందని నమ్మించే ప్రయత్నం చేశారని సీఐడి అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో అసలు ఆ లేఖ ఎక్కడ తయరైందనే ఆసక్తికర కోణం పైన ఇప్పుడు సీఐడీ ఉన్నతాధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వైసీపీ తొలి నుండి ఈ లేఖ ఎన్నికల కమిషనర్ తయారు చేయలేదని..టీడీపీ కార్యాలయంలో తయారు చేసిన లేఖను నిమ్మగడ్డ కేంద్రానికి పంపారని ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా..రెండు సందర్భాల్లో నిమ్మగడ్డ చేసిన సంతకాల్లోని తేడాలను సైతం ప్రస్తావిస్తోంది.

మరింత సమాచారం సేకరిస్తాం: సీఐడీ
ఇక, తమతో సంప్రదించకుండా కరోనా కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయటాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం..ఎన్నికల సంస్కరణల పేరుతో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనగరాజన్ ను కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమించింది. ఈ వ్యవహారం పైన ప్రస్తుతం హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి. ఇప్పుడు సీఐడీ మరింత వేగంగా లేఖ వ్యవహారం తేల్చే పనిలో పడింది. కార్యాలయంలో ఆ లేఖ తయారు కాలేదని నిర్ధారణకు వచ్చిన సీఐడీ...అవసరమైతే నిమ్మగడ్డ నుండి సమాచారం సేకరిస్తామని చెబుతోంది. మరి..నిజంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా టీడీపీ నేతల నుండే ఈ లేఖ నిమ్మగడ్డకు అందిందా..సీఐడీ తమ తుది విచారణలో ఏం తేల్చోబోతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications