ఫిఫాలో సంభ్రమాశ్చర్యాలు: నాకౌట్స్ లో బుల్లి దేశం: మట్టికరిచిన ఎక్స్ ఛాంపియన్
ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ చారిత్రాత్మక అద్భుతం ఇది. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని చిరు ద్వీప దేశం కేప్ వెర్డే (Cape Verde) వరల్డ్ కప్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. నూతన సంచలనం సృష్టించింది. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ చరిత్రలోనే నాకౌట్ స్థానాన్ని దక్కించుకున్న అత్యంత చిన్న దేశంగా ఇది చరిత్ర లిఖించింది. పైగా తనకంటే ఎన్నో రెట్లు బలమైన జట్టు, రెండు సార్లు ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడిన ఉరుగ్వేను వెనక్కి నెట్టి ఈ ఘనత అందుకోవడం విస్మయానికి గురిచేసింది.
గ్రూప్-హెచ్ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌తో కేప్ వెర్డే ఈ చిరస్మరణీయ రికార్డును అందుకుంది. హ్యూస్టన్ వేదికగా తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం మధ్య సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌ను కేప్ వెర్డే 0-0 తేడాతో డ్రాగా ముగించింది. అదే సమయంలో గ్వాడలజారాలో జరిగిన మరొక హైవోల్టేజ్ గేమ్ లో స్పెయిన్ చేతిలో ఉరుగ్వే 0-1 తేడాతో పరాజయం పాలైంది.

ఈ ఫలితాలతో కేప్ వర్డే గ్రూప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రాండ్ గా నాకౌట్స్ కు చేరింది. రెండుసార్లు ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఉరుగ్వే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. కేప్ వెర్డే నాకౌట్స్ లో చేరినట్టు తెలియగానే అభిమానులు ఉప్పొంగిపోయారు. కెప్టెన్ వోజిన్హా తల్లి స్టాండ్స్‌లో డాన్స్ చేయడం కనిపించింది. తోటి ప్లేయర్లు వొజిన్హాను తమ భుజాలపైకి ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు.
అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ 10 అగ్నిపర్వత ద్వీపాల సముదాయం కేప్ వర్డే. వైశాల్యం, జనాభా పరంగా చాలా చిన్నది. ఇలాంటిదొక దేశం ఉందనే విషయం కూడా సగం ప్రపంచానికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఫిఫా వరల్డ్ కప్ లో అడుగు పెట్టడంతో దీని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఇప్పుడదే బుల్లి దేశం.. వరల్డ్ కప్ నాకౌట్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమౌతోన్నాయి. కేప్ వెర్డే ప్రయాణం ఇక్కడి వరకు సాగుతుందనే అభిప్రాయం ఎవరికీ ఉండకపోవచ్చు.
హెడ్ కోచ్ బుబిస్టా ఆధ్వర్యంలో ఈ జట్టు సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగింది. మొదటిసారిగా ప్రపంచకప్ ఆడుతున్నప్పటికీ.. ప్రత్యర్థులకు ఎక్కడా తలవంచలేదు. శాయశక్తులా పోరాడింది. ఏ జట్టుకూ లొంగిపోకుండా అద్భుతమైన పోరాటపటిమను కనబరిచింది. ఆటగాళ్ల క్రమశిక్షణతో కూడిన రక్షణాత్మక శైలి జట్టుకు ప్రధాన బలంగా మారి నాకౌట్ దారిని సుగమం చేసింది.
ఈ టోర్నీ గ్రూప్ దశలో కేప్ వర్డే ప్రయాణం ఎందరికో ఆదర్శం. తమ మొదటి మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్‌ను 0-0తో నిలువరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఉరుగ్వేతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 2-2తో పోరాడి డ్రా చేసుకుంది. చివరగా సౌదీ అరేబియాతో డ్రా చేసుకుని ఒక పాయింట్‌తో చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేకుండా అత్యంత ప్రతిష్ఠాత్మక నాకౌట్ అర్హతను సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications