ఓటీటీలో దుమ్ము రేపుతున్న సినిమా.. 10 దేశాల్లో నంబర్ వన్ ట్రెండింగ్!
థియేటర్లలో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న సినిమాలు, ఓటీటీ వేదికలపై అనూహ్యమైన ఆదరణ పొందడం ఇటీవల తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లకు డిజిటల్ ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. తాజాగా ఈ కోవలో చేరి, నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డుల వేట కొనసాగిస్తున్న చిత్రమే 'దాయరా'.
నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించిన ఈ చిత్రం, కేవలం మొదటి మూడు రోజుల్లోనే 3.2 మిలియన్లవ్యూస్, 7.4 మిలియన్ల వ్యూయింగ్ అవర్స్‌తో సంచలనం సృష్టించింది. గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ టాప్-10 సినిమాల జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. విశేషమేమిటంటే, భారత్‌తో పాటు యూఏఈ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, పాకిస్థాన్ వంటి 10 దేశాల్లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

కథా నేపథ్యం ఏంటంటే?
2019లో హైదరాబాద్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' హత్యాచార ఘటన, ఆ తర్వాత నిందితుల ఎన్కౌంటర్ వంటి వాస్తవ పరిస్థితుల స్ఫూర్తితో ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ మోరల్ క్రైమ్ డ్రామాను రూపొందించారు. ఒక యువతిపై జరిగిన దారుణ హత్యాచార కేసులో నిందితులను డీసీపీ రమణ్ కుమార్ ఎన్కౌంటర్ చేస్తారు. ఈ చర్యతో ఒక్కసారిగా ప్రజల దృష్టిలో ఆయన హీరోగా మారిపోతారు.
అయితే, ఆ ఎన్కౌంటర్ బూటకమనే అనుమానాలు తలెత్తడంతో కేసు కొత్త మలుపు తిరుగుతుంది. దీనిపై లోతైన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్ అధికారిణిగా డీసీపీ అజూనీ కోహ్లీ (కరీనా కపూర్ ఖాన్) నియమితులవుతారు. 'తక్షణ న్యాయం' వర్సెస్ 'చట్టబద్ధమైన విచారణ' అనే రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగే ఆలోచనాత్మక సంఘర్షణ, ఆద్యంతం ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
నటీనటులు, సాంకేతిక వివరాలు
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనా కపూర్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీరితో పాటు ప్రగతి మిశ్రా, భవేష్ బబ్బాని, క్షితీ జోగ్, కన్వల్జిత్ సింగ్, అనూజా సాఠే కీలక పాత్రల్లో మెరిశారు. నీత్ జైన్, ధవల్ గడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆలోచింపజేసే కథాంశంతో పాటు గ్రిప్పింగ్‌గా సాగే క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'దాయరా' ఒక మంచి ఆప్షన్.














Click it and Unblock the Notifications
