వాట్సాప్ గ్రూపులో చిరంజీవి, బాలయ్య
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద వీరి సినిమాల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తూనే ఉంది. వీరి చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే, వెండితెరపై ఉండే ఈ పోటీ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ ఉందని, చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేరని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. తాజాగా ఈ ఊహాగానాలపై సీనియర్ హీరో సుమన్ తనదైన శైలిలో స్పష్టతనిచ్చారు.
వ్యక్తిత్వాల్లో తేడా అంతే.. శత్రుత్వం కాదు!
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరితోనూ సుమన్‌కు దశాబ్దాల పరిచయం ఉంది. ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి స్వభావాల గురించి ఆయన మాట్లాడుతూ.. "ప్రతి మనిషి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది, ఒకరిని మరొకరితో పోల్చడం సరికాదు" అని హితవు పలికారు. బాలకృష్ణ గురించి వివరిస్తూ.. ఆయన మనసులో ఏదీ దాచుకోరని, మంచికి మంచిగా, చెడుకు చెడుగా స్పందిస్తారని తెలిపారు.

ఒకవైపు సినిమాలు, మరోవైపు ఎమ్మెల్యే బాధ్యతలు, ఇంకోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఉండటం వల్ల బాలయ్యకు కాస్త ముక్కోపం ఉండటం సహజమేనని సుమన్ పేర్కొన్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి స్వభావం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందని సుమన్ చెప్పారు. చిరంజీవి చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్తి అని, తనకు ఎంత చిరాకు లేదా కోపం కలిగించే పరిస్థితి ఎదురైనా దానిని బయటకు కనిపించకుండా నియంత్రించుకునే పరిణతి ఆయనలో ఉందని వివరించారు.
వివాదాలకు అసలు కారణం ఇదే..
మరి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు ఎందుకు వస్తున్నాయన్న ప్రశ్నకు సుమన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కేవలం రాజకీయ ప్రకటనలు, ఆవేశపూరిత వాగ్వాదాల వల్లే ఇలాంటి వివాదాలు పుట్టుకొస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆవేశంలో ఎవరైనా నోరు జారినా, అది ఆ క్షణం వరకే పరిమితమవుతుందని, హీరోలెవరూ ఎదురెదురుగా నిలబడి ద్వేషించుకోరని సుమన్ తేల్చి చెప్పారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు హీరోల మధ్య ఎలాంటి వైరం లేదని సుమన్ స్పష్టం చేశారు. "మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాం.
మాకంటూ ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో రోజూ పలకరించుకుంటాం, శుభాకాంక్షలు చెప్పుకుంటాం, సరదాగా ఫోటోలు షేర్ చేసుకుంటాం" అని ఆయన వెల్లడించారు. హీరోలంతా ఇంత ఆత్మీయంగా కలిసిమెలిసి ఉంటుంటే, బయట అభిమానులు మాత్రం అనవసరంగా ఆవేశాలకు లోనై గొడవలు పడటం, ఆస్తులు ధ్వంసం చేసుకోవడం చాలా బాధాకరమని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోలాగే సినిమా రంగంలోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, అభిమానులు ఈ వాస్తవాన్ని గ్రహించి సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు.














Click it and Unblock the Notifications
