హైదరాబాద్ పాడ్ టాక్సీలపై కీలక ముందడుగ.. ట్రాఫిక్ జామ్ లకు చెక్!
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ సామాన్య ప్రయాణికులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన మార్గాల్లో ప్రయాణం కొంత మేర సులభతరమైంది. కానీ మెట్రో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆఫీసులకు, ఐటీ క్యాంపస్‌లకు లేదా ఇళ్లకు వెళ్లడానికి 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ' లేక జనం ఇబ్బంది పడుతున్నారు.
సరైన ప్రజారవాణా సౌకర్యాలు సరిపోక, క్యాబ్‌లు, ఆటోల చార్జీలు భారంగా మారడంతో ప్రయాణికుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. డ్రైవర్ అవసరం లేకుండా, బ్యాటరీతో నడిచే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే పాడ్ ట్యాక్సీలను నగరంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మూడు కీలక మార్గాలను ఎంపిక చేశారు.

వాటిలో కేపీహెచ్‌బీ నుంచి బయోడైవర్సిటీ వరకు, ఎల్బీ స్టేడియం నుంచి రాణిగంజ్ వరకు, అలాగే అసెంబ్లీ నుంచి బేగంపేట వరకు ఉన్న మార్గాలు ఉన్నాయి. ఐటీ హబ్‌లు, వాణిజ్య ప్రాంతాలు, రద్దీ కూడళ్లను కలుపుతూ ఉండే ఈ రూట్లలో పీఆర్టీఎస్ సేవలను త్వరగా పట్టాలెక్కించేందుకు డిసెంబరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని మెట్రో రైలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి, సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. పాడ్ ట్యాక్సీ వ్యవస్థ పనితీరు సాధారణ ప్రజా రవాణాకు భిన్నంగా, ఆధునికంగా ఉంటుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాక్‌లు, గైడ్వేలను నిర్మిస్తారు. మెట్రో రైళ్ల తరహాలోనే ఈ వాహనాలకు కూడా డ్రైవర్లు ఉండరు; సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తిగా ఆటోమేటిక్‌గా నడుస్తాయి.
చూడటానికి చిన్న కారులా కనిపించే ఒక్కో పాడ్ ట్యాక్సీలో నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణించే వీలుంటుంది. అవసరాన్ని బట్టి 15 నుంచి 20 మంది వరకు ప్రయాణించగలిగే గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను కూడా జోడించవచ్చు. ప్రయాణికులు పాడ్‌లో కూర్చున్న తర్వాత అందులో ఉండే టచ్‌పాడ్ ద్వారా తమ గమ్యస్థానాన్ని ఎంచుకుంటే, నేరుగా అక్కడికే తీసుకెళ్తుంది.
పర్యావరణ హితంగా ఉండటం ఈ వ్యవస్థ మరో ప్రధాన ప్రత్యేకత. పూర్తిగా బ్యాటరీ శక్తితో నడుస్తాయి కాబట్టి పొగ, శబ్ద కాలుష్యం వంటి సమస్యలు ఉండవు. గంటకు సుమారు 35 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ పాడ్లు మెట్రో స్టేషన్లు, ప్రధాన బస్ స్టాప్ల నుంచి సమీపంలోని కార్యాలయాలు, నివాస కాలనీలకు వేగంగా చేరుస్తాయి. రోడ్డుపై నడిచే వాహనాలతో సంబంధం లేకుండా ఎలివేటెడ్ ట్రాక్‌లపై సాగుతాయి కాబట్టి ట్రాఫిక్ సిగ్నళ్లు, జామ్‌ల బెడద ఉండదు. హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టు అమలైతే, భవిష్యత్తులో ఇతర నగరాలకు కూడా ఇది ఒక మార్గదర్శక నమూనాగా నిలిచే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
