మూడు ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై చంద్రబాబు కీలక నిర్ణయాలు...!!
ఏపీలోని మూడు ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల పురోగతి పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రస్తుత అంచనాలు.. భవిష్యత్ లక్ష్యాల పైన స్పష్టత ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటుగా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా కొత్త నిర్ణయాలు అమలు చేయనున్నారు.
ఏపీలో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి, భారీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లు నిలవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అదే విధంగా విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో వివిధ శాఖల ద్వారా 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 64 పనులను ప్రారంభించారు.

మూడు రీజియన్ల కేంద్రంగా
కాగా, విశాఖ ప్రాంతానికి యాంకర్ ప్రాజెక్టుగా వైజాగ్ బే సిటీని అభివృద్ధి చేయనున్నారు. మధుర వాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌లను ఏర్పాటు చేయను న్నారు. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడలో ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 నుంచి 20 కొత్త ఐటీ సంస్థలను ఆకర్షించడంతోపాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తీర ప్రాంత అభివృద్ధి, కోనసీమ బ్యాక్‌వాటర్స్, అరకు, మారేడుమిల్లి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులపైనా దృష్టి సారించారు. కాగా.. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, స్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటోమొబైల్, ఈవీ, డిఫెన్స్, టూరిజం, నాలెడ్జ్ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













Click it and Unblock the Notifications
