మునిసిపల్ లేఔట్ లో స్థలాలు కబ్జా చేసిన ఆ పార్టీ నాయకులు !!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు కనబడితే కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. పార్కుల కోసం వదిలిన భూములు, మున్సిపల్ శాఖలో అభివృద్ధి పనులకు కేటాయించిన భూములను కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారని వెలుగు చూడడంతో వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ పట్టణంలో వైసీపీ నాయకులు చేతివాటం చూపించారని వెలుగు చూసింది.
డోన్ పట్టణంలోని కొందరు వైసీపీ నాయకులు మున్సిపల్ లేఔట్ లోని ఖాళీ స్థలాలను కబ్జా చేసి అందులో కట్టడాలు నిర్మించడానికి ప్రయత్నించారని వెలుగు చూసింది. ఆ స్థలాలను కబ్జా చేసిన 14 మందిని గుర్తించిన అధికారులు వారిలో కొందరికి నోటీసులు జారీ చేశారు. రెండు సంవత్సరాల క్రితం వరకు డోన్ పట్టణంలో మున్సిపల్ లేఔట్ లో ఖాళీ స్థలాలు అలాగే ఉన్నాయి. ఆ భూములపై కొందరు వైసీపీ నాయకులు కన్ను వేశారు.

వైసీపీ నాయకులు కొన్ని స్థలాలను కబ్జా చేసి అందులో ఫౌండేషన్ వేశారు. కొందరు పిల్లర్లు వేసి గోడలు కూడా కట్టేశారు. ఇంత జరుగుతున్నా డోన్ మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వైసీపీ నాయకుడు అక్కడ కట్టడాల పనులను తాత్కాలికంగా నిలిపేశారు. వైసీపీ అధికారంలో లేదని, ఇక్కడ కట్టడాలు పూర్తి చేస్తే ఆ తర్వాత అధికారులు కూల్చేస్తారని స్థానిక వైసీపీ నాయకులు కొందరు అక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారికి చెప్పారని తెలిసింది.
స్థానిక తెలుగుదేశం, జనసేన నాయకులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డోన్ పట్టణంలోని మున్సిపల్ లేఔట్ లో స్థలాలు కబ్జా చేసి అక్కడ అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారిని గుర్తించారు. అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులను నోటీసు అతికించారు. కొందరు వైసీపీ కార్యకర్తలని వ్యక్తిగతంగా కలిసిన మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి ఏడు రోజుల లోపల అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా సంవత్సరాల నుండి డోన్ పట్టణంలోని మున్సిపల్ లేఔట్ లో ఖాళీగానే ఆ స్థలాలు ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొందరు వైసీపీ నాయకులు ఆ స్థలాలను కబ్జాలు చేసినా ఆ సమయంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని, కట్టాలు నిర్మించిన వారిని వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications