Chandrababu Security : చంద్రబాబుకు అదనపు భద్రత-ఎందుకంటే ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చంద్రబాబుకు జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) గార్డులతో భద్రత ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలుమార్లు చంద్రబాబుకు ఉన్న పోలీసు భద్రతను తగ్గించేందుకు ప్రయత్నించగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించి మరీ భద్రత కొనసాగింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబును అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరికలు పంపారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తాజాగా దళితులపై చేశారని చెబుతున్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరుతూ చంద్రబాబు ఎర్రగొండపాలెం టూర్ అడ్డుకోవాలని మంత్రి,స్ధానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనకు వస్తున్నారని తెలియడంతో వైసీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలకు దిగాయి. దీంతో పరిస్ధితి గమనించిన ఎన్ఎస్జీ చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించింది. అలాగే పోలీసులు కూడా మరింత సిబ్బందిని రప్పించి చంద్రబాబుకు భద్రతగా ఉంచారు. దీంతో ఎర్రగొండపాలెంలో చంద్రబాబు టూర్ ఉత్కంఠ రేపుతోంది. ఎస్సీలకు క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును అడ్డుకుని తీరుతామని మరోవైపు వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇవాళ ఎర్రగొండపాలెంలో పర్యటించనున్నారు. ఎర్రగొండపాలెంలో రోడ్ షో నిర్వహించడంతో పాటు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్ఎస్జీ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు టూర్ నేపథ్యంలో పలువురు కిందిస్ధాయి కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications