షాక్: బండిశూల తిరుణాలలో అపశృతి, ఇద్దరు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లె-కాశేపల్లె మధ్యలో శుక్రవారం రాత్రి జరిగిన పోలేరమ్మ బండిశూల తిరుణాలలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రథాన్ని లాగుతుండగా విద్యుదాఘాతం జరిగి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రథం వద్ద ఉన్న రామాంజులరెడ్డి(25) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన ముత్యాలరెడ్డి(45)ని గుత్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి గ్రామంలో ఎడ్లబండిపై బండిశూల తిరుణాల నిర్వహిస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం జరగడంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.

షాక్ తగిలి మూడు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో హాహాకారాలు చెలరేగాయి. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ సంఘటనతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. అక్కడ తీవ్ర అంధకారం అలుముకుంది. హాహాకారాలు మిన్ను ముట్టాయి. ఏం జరుగుతోందో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications