ఆ ఇద్దరికీ దిమ్మ తిరిగేలా, కొత్త వరాలు - జగన్ విన్నింగ్ ఫార్ములా..!!
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. అధికారం నిలబెట్టుకొనేందుకు ప్రతిపక్షాల కంటే జగన్ ముందుగానే తన సైన్యాన్ని ప్రజల్లోకి పంపారు. అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఎన్నికల ముందే వరాల ప్రకటనకు భారీ కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు.
పైచేయి సాధించేలా : చంద్రబాబు జైలులో ఉండటం.. పొత్తు లెక్కల మధ్య ప్రతిపక్షాలు ఉన్న సమయంలోనే పూర్తిగా పై చేయి సాధించేలా జగన్ కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దమయ్యారు. ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్దం అయ్యే లోగానే జగన్ పూర్తిగా ప్రజలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ 2.45 లక్షల కోట్ల మేర సంక్షేమం ప్రజలకు అందినట్లు అధికారికంగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

సంక్షేమం చుట్టూ ఎన్నికల ఫలితాలు డిసైడ్ అవుతున్న సమయంలో టీడీపీ కూడా సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. కానీ, ఆశించిన ఆదరణ కనిపించలేదు. దీంతో, జగన్ మరింగా సంక్షేమ ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే జనవరి నుంచి పెన్షన్ రూ 3 వేలకు పెంచటంతో పాటుగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నిధుల జమకు షెడ్యూల్ ఖరారు చేసారు.
ఎన్నికల వరాలు : ఇక వీటితో పాటుగా రుణ మాఫీ వంటి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని అమలు చేయటం..లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. 2014 లో చంద్రబాబు...పవన్ కల్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లో షరుతులు పెట్టి..పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని...చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా పాజిటివ్ ఓట్ ను నమ్ముకున్న జగన్..ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల వేళ సంచలనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రతిపక్షాలక ఛాన్స్ లేకుండా : ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్య అన్ని పథకాలతో కలిపితే దాదాపుగా కోటిన్నార మంది వరకు ఉన్నట్లు అంచనా. 87 శాతం మందికి సంక్షేమ పథకాలు అమలు అందుతున్నాయని స్వయంగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. వీరంతా తనకే మద్దతుగా నిలుస్తారనేది జగన్ నమ్మకం. చంద్రబాబు - పవన్ విశ్వసనీయత దెబ్బ తీయటంలో సక్సెస్ అయ్యారు. ఈ సంక్షేమం కంటే ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పినా.. నమ్మలేని పరిస్థితులు జగన్ క్రియేట్ చేస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ను కొనసాగిస్తూ..టీడీపీ తమ ఓట్ బ్యాంక్ గా చెప్పుకొనే వర్గాలను పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. తన వెనుక ఉన్నది నలుగురేనని.. నా బీసీలు ..నా ఎస్సీలు..నా ఎస్టీలే..నా మైనార్టీలు.. నా పేదలు అంటూ జగన్ ఆ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దీంతో...జగన్ పూర్తిగా తన ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతూ..గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లేందుకు విన్నింగ్ ఫార్ములాతో సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications