జగన్ కు ప్రజా మద్దతు ఏ స్థాయిలో - మెగా పీపుల్స్ సర్వేలో తేలిదేంటి..!?
ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలిచేదెవరు. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. టీడీపీ అధికారం తమదే ఖాయమని ధీమాగా ఉన్నారు. జనసేన - టీడీపీ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో కీలక సమీకరణం కానుంది.
ఈ సమయంలో జగన్ కు ప్రజల్లో ఉన్న మద్దతు ఎంత అనేది కీలకంగా మారుతోంది. తాజాగా మెగా పీపుల్స్ సర్వేలో జగన్ కు లబిస్తున్న మద్దతు పైన ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే రిపోర్టుతో వైసీపీతో కొత్త జోష్ కనిపిస్తోంది.

సీఎం జగన్ పిలుపు వెనుక:ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలోనూ ప్రత్యర్ది పార్టీల పొత్తుల గురించి ప్రస్తావిస్తున్నారు. తోడేళ్లనీ ఏకమైనా తన కేమీ భయం లేదని చెబుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే తోడుగా నిలవండి. మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలండి అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడంటూ వారిలో తాను ఒకడిగా చెప్పుకుంటున్నారు.
అంతా ఏకమై తనతో చీకటి యుద్దం చేస్తున్నారని వివరించి చెబుతున్నారు. ఈ యుద్ధంలో తన ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ప్రజలేనని.. దేవుని దయ.. ప్రజల చల్లని ఆశీస్సులే కోరుకుంటున్నానని చెప్పుకొస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన నేరుగా ప్రజాభిప్రాయం తీసుకొనేందకు పార్టీ శ్రేణులను ప్రజల మధ్యకు పంపారు.
70 లక్షల కుటుంబాల మద్దతు:వైసీపీ జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమంలో ప్రజలకు జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మెగా పీపుల్స్ సర్వే నిర్వహిస్తున్నారు. స్వచ్చందంగా ప్రజల నుంచి మద్దతు ఇచ్చే వారి నుంచి మిస్డ్ కాల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు కోటి కుటుంబాల్లో పార్టీ శ్రేణులు సర్వే చేసారు. అందులో 70 లక్షల కుటుంబాల నుంచి జగన్ కు మద్దతు లభించింది. తమ వద్దకు వచ్చిన పార్టీ శ్రేణులకు తామంతా జగన్ తోనే ఉంటామని చెప్పటంతో పాటుగా మిస్డ్ కాల్స్ ఇచ్చి తమ మద్దతు రికార్డు చేసారు.
ఈ నెల 29 వరకు మొత్తంగా 1.60 కోట్ల ఇళ్లకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పబ్లిక్ మూడ్ కు అనుగుణంగా ఎన్నికలకు మిగిలిన సమయంలో కావాల్సిన నిర్ణయాలకు వీలుగా ఈ సర్వే కొనసాగుతోంది.

ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్..:మెగా పీపుల్స్ సర్వే కొనసాగుతున్న సమయంలోనే జాతీయ మీడియా సంస్థ సర్వే రిపోర్టులు వెల్లడయ్యాయి. టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్న సంగతి తెల్సిందే. అంటే వైయస్ఆర్‌సీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ 22 లోక్ సభ సీట్లు గెలవగా, 151 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి.
తిరిగి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి తిరిగి దక్కే సీట్ల గురించి సర్వే సంస్థ అంచనా వేసింది. అటు జాతీయ సర్వే, ఇటు మెగా పీపుల్స్ సర్వే లెక్కలతో వైసీపీలో జోష్ పెరుగుతోంది. మెగా పీపుల్స్ సర్వేలో పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా పథకాల అమలుతో పాటుగా పాలనా పరంగా అమలు చేసిన అంశాల పైన ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా ఎన్నికలకు సమరశంఖం పూరించనున్నారు.












Click it and Unblock the Notifications