ఏపీలో గెలిచేదెవరు, ఢిల్లీ ముఖ్యుల సర్వేలో క్లారిటీ - పొత్తుల్లో కొత్త లెక్కలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ పొత్తుల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒకటవుతున్నాయి. బీజేపీ నిర్ణయం కీలకం కానుంది. ఇదే సమయంలో బీజేపీ కేంద్రం నాయకత్వం ఏపీలో రాజకీయం పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు ఎవరికి గెలుపు అవకాశం ఉందనేది అంచనా వేస్తోంది. తాజా సర్వేతో ఒక స్పష్టత వచ్చినట్లు సమాచారం. దీంతో, ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
మారుతున్న రాజకీయం
ఏపీలో 2014 ఎన్నికల రాజకీయం రిపీట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తమతో కలుపుకొని వెళ్లాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. మూడు పార్టీలు కలిస్తేనే జగన్ ను ఓడిస్తామనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తానని చెబుతున్నారు. తన హయాంలో అందించిన సంక్షేమమే తమను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్ధిస్తున్నారు. అటు జగన్ సంక్షేమానికి పోటీగా టీడీపీ సంక్షేమ మేనిఫెస్టో ప్రకటంచింది. కానీ, ఆశించిన స్థాయిలో టీడీపీ సంక్షేమానికి ఆదరణ కనిపించటం లేదు.

బీజేపీ ముందు కొత్త ప్రతిపాదనలు
ఈ సమయంలోనే చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ప్రధాని మోదీ నాయకత్వం పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో ఒంటరి పోరు సంకేతాలు ఇచ్చిన టీడీపీ, ఏపీలో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షా తో మంతనాల దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో కేవలం ప్రత్యేక హోదా విషయంలో నే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు వివరణ ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే, బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుపైన ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు. అయినా, చివరి వరకు చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలోని ముఖ్యులు అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థతో చేయించిన సర్వేలో ఏపీలోని పరిస్థితులపైన అధ్యయనం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

పొత్తులపై బీజేపీ నిర్ణయం ఏంటి
కేంద్రం పెద్దలకు అందిన సర్వేలో ఏపీలో అధికార వైసీపీకి 53 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో పలు జాతీయ సంస్థల సర్వేలోనూ వైసీపీకే 18కి పైగా లోక్ సభ స్థానాలు వస్తాయని చెబుతూ వచ్చాయి. ఈ సమయంలో బీజేపీకి లోక్ సభ లో మద్దతు కీలకం కావటంతో..ెవరికి ఎక్కువ సీట్లు వస్తే వారితో బీజేపీ బంధం కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో..టీడీపీ నుంచి ఏపీలో పొత్తుల కోసం కొత్తగా బీజేపీ, జనసేనకు ప్రతిపాదనలు అందినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా 60 అసెంబ్లీ, 10 లోక్ సభ ఇచ్చేందుకు సిద్దమంటూ సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. ఇటు వైసీపీ పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే లెక్కల్లో 60 శాతం వరకు పాజిటివ్ ఓటింగ్ ఉన్నట్లు వెల్లడించారు. దీంతో, సర్వేలు వైసీపీ వైపు ఉండటంతో..బీజేపీ ఎటువైపు ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications