కడప జిల్లాలో పరువు హత్య: తల్లిదండ్రులే హత్య చేసి కాల్చేశారు?
అమరావతి: నవమాసాలు మోసి కనిపెంచుకున్న కూతురు పరువు పోయేతప్పు చేసిందని తెలియడంతో తల్లిదండ్రులే గుట్టు చప్పుడు కాకుండా హత్య చేసిన కాల్చేశారని కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజుపురం గ్రామపంచాయతీ కాపుపల్లెలో ఓ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటొంది.
ఈ పరువు హత్య విషంయ ఆనోటా ఈనోటా పడి చివరకు పోలీసులకు తెలియడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే రాఘవరాజుపురానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
20 ఏళ్ల వయసున్న పెద్దకుమార్తెను అదే గ్రామ పంచాయితీలోలని సమీప దళితవాడకు చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చించినట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పరువు పోకుండా ఉండేందుకు యువతికి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోవడంతో అబార్షన్ చేయించడానికి వీలు కాలేదని తెలుస్తోంది. దీంతో పరువుగా బతికే ఆ తల్లిదండ్రులకు ఊర్లో ఉన్న పరువు పోతుందని భావించి కుమార్తెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు తండ్రి, చిన్నకుమార్తె సహకరించక పోవడంతో కన్నతల్లే కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాపించింది.
అయితే కూల్‌డ్రింకును కొద్దిగా తాగిన యువతి అందులో ఏదో విషపదార్ధం ఉందని తెలుసుకొని తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో తల్లితండ్రులు కుమార్తెను నాలుగు రోజుల క్రితం పొలం వద్దకు తీసుకెళ్ళి కొట్టి చంపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం యవతి మృతదేహాన్ని కాల్చినట్టుగా సమాచారం.
గ్రామంలో కొందరు తప్పు చేసిన కుమార్తెను మందలించే క్రమంలో దండిస్తుండగా పొరబాటున ఆయువుపట్టున తగిలి మృతి చెందిందని చెబుతున్నారు. యువతే అరటితోటలో పురుగుల మందు తాగి మృతిచెందినట్లు మరికొంత మంది చెప్పుకొంటున్నారు. అయితే ఈ విషయం పక్కాగా తెలిసిన కొందరు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలోకి వెళ్ళి యువతిని దహనం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి తల్లి తండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది. తల్లితండ్రులు మాత్రం తమ కుమార్తె కడుపు నొప్పి తాళలేక పురుగుల మందుతాగి మృతిచెందినట్లు ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే యువతి మృతికి ప్రధాన కారణమైన దళితవాడకు చెందిన యువకుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యువతిది పరువుహత్యా? ఆత్మహత్యా? ప్రమాదవశాత్తు మరణమా? అనేవిషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై ఎస్సై రమేష్‌బాబు మాట్లాడుతూ విచారణ పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications