జనసేన సీట్లు ఖరారు - అక్కడే 14 స్థానాలు, అభ్యర్దులు ఫిక్స్..!!
ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఖాయమయ్యాయి. అందులో అయిదు స్థానాలకు పవన్ తమ అభ్యర్దులను ఖరారు చేసారు. పార్టీ పోటీ చేసే మిగిలిన 19 స్థానాల పైన స్పష్టత వస్తోంది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఎంపీ అభ్యర్దులు ఫైనల్ అయ్యారు. టీడీపీ సీనియర్లు ఆశిస్తున్న సీట్లు అందులో ఉండటంతో ప్రకటనపైన ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
జనసేన స్థానాలు ఖరారు: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు ఖాయమయ్యాయి. అందులో భాగంగా 5 స్థానాలు, అభ్యర్దులను పవన్ ప్రకటించారు. పవన్ 24 సీట్లు అంగీకరించటం పైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మూడు ఎంపీ స్థానాల్లో కాకినాడ నుంచి సానా సతీష్, అనకాపల్లి నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పేర్లు దాదాపు ఖాయమయ్యాయి. తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీచేసే తమ అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. రాజోలులో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు. అంటే ఇప్పటికి ఆరు స్థానాలపై స్పష్టత వచ్చింది.
గోదావరి జిల్లాల పైనే ఫోకస్: మిగిలిన 18 స్థానాల్లో మెజారిటీ సీట్లు ఖరారయ్యాయి. వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం.. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్లు సమాచారం.
రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి నిడదవోలు స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడ నుంచి పోటీకి దిగాలని కందుల దుర్గేశ్ కు సూచించారు. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ గతంలో దర్శి సీటు కోరగా తాజాగా గిద్దలూరు ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశముందని ప్ర చారం జరుగుతోంది.
సమన్వయం కోసం ప్రయత్నం: రాయలసీమలో అనంతపురం లేదా పుట్టపర్తి స్థానాలు జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆశిస్తున్నవాటిలో ఉన్నాయి. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ సీనియర్లు ఆశావాహులుగా ఉండటంతో వారిని బుజ్జగించి జనసేన సీట్లు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్దుల విషయంలోనూ ఇప్పటికే పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి పొత్తులో ఖరారైన సీట్ల పైన ఆశలు పెట్టుకున్న జనసేన నేతలను బుజ్జగించేందుకు పవన్ నేరుగా వారితో మాట్లాడుతున్నారు. తాడేపల్లి గూడెం సభ తరువాత పవన్ తన అభ్యర్దులను ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications