పొత్తుపై బీజేపీ తాజా సంకేతాలు - చంద్రబాబు, పవన్ యాక్షన్ ప్లాన్ సిద్దం..!!
ఏపీలో పొత్తుల రాజకీయంలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన జత కట్టాయి. తమతో బీజేపీ కలిసి రావాలని కోరుతున్నాయి. 2014 తరహా పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి. కానీ, బీజేపీ నుంచి సానుకూలత కనిపించటం లేదు. దీని పైన తాజాగా చంద్రబాబు, పవన్ చర్చల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ పొత్తులు, కొత్త కార్యాచరణ పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
సీట్ల పై క్లారిటీ: టీడీపీ, జనసేన పొత్తుల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. చంద్రబాబు జనసేనకు 22-25 సీట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. పవన్ కల్యాణ్ 35 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీని పైన నియోజకవర్గాల జాబితా ఇచ్చారు. ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో పవన్ ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు.

ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో సీటు ఇవ్వాలని చర్చల్లో భాగంగా ప్రతిపాదించారు. ప్రస్తుతానికి జనసేనకు 25 సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పవన్ కోరిన జాబితాలో అమలాపురం, రాజోలు, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, విశాఖ, ఉంగుటూరు, దర్శి, అనంతపూర్, రాజమండ్రి రూరల్, నెల్లిమర్ల, తెనాలి, భీమవరం, తాడేపల్లి గూడెం ఉన్నాయి.
ఎవరికి ఎక్కడ: అదే విధంగా రైల్వే కోడూరు, కొత్తపేట, పోలవరం, విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్, ఎలమంచిలి, పెందుర్తి, గాజువాక, అవనిగడ్డ, భీమిలి, పెడన, నిడుదవోలు, తణుకు, ఏలూరు, పి. గన్నవరం, తిరుపతి, రజాంపేట, నెల్లూరు అర్బన్/ రూరల్, కైకలూరు, మదనపల్లి స్థానాలు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఇందులో టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోకవర్గాలు ఉండటంతో వాటిని ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
ఈ నెల 8న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా అనేది త్వరగా తేల్చుకోవాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇందు కోసం పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీ తరువాత ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ముఖ్యులతో పవన్ టచ్ లో ఉన్నారని సమాచారం.

బీజేపీతో పొత్తు పైనా: బీజేపీ పొత్తుకు అంగీకరిస్తే 10 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ కలిసి రాకపోతే..ఈ నెల 14న పాలకొల్లు సభలో తాము రెండు పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ..మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో సీపీఐ నుంచి కీలక ప్రతిపాదన అందినట్లు సమాచారం.
బీజేపీతో పొత్తు లేకపోతే ఈ రెండు పార్టీలతో కలిసేందుకు సిద్దమని ఆ పార్టీ నుంచి సంకేతాలు అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ తో పొత్తు అంశం పైన స్పష్టత వచ్చిన తరువాతనే ఆ ప్రతిపాదన పరిశీలించాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. దీంతో, వచ్చే వారం ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల పైన ఒక స్పష్టత..భవిష్యత్ కార్యాచరణ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications