బీజేపీ-టీడీపీకి పవన్ క్లారిటీ, అక్కడే ట్విస్ట్: చంద్రబాబు అంగీకరిస్తే - పొత్తు ఫైనల్..!?
పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ- టీడీపీకి తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. అదే సమయంలో ట్విస్టు ఇచ్చారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ- టీడీపీకి తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. పొత్తులపైన అధికారికంగా చెప్పకపోయినా..జరిగేది ఏంటో తేల్చేసారు. అదే సమయంలో ట్విస్టు ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని స్పష్టం చేసారు. వైసీపీ తనను కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి చంద్రబాబు అధికారం కోసం తాకట్టు పెడుతున్నారనే విమర్శల ను నమ్మద్దని సూచించారు. తన అభిమానులు..జనసైనికులు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుందంటూ చెప్పటం ద్వారా పవన్ పొత్తుకు సై అంటూనే తాను చెప్పదలచుకున్నది చెప్పారు. ఇక ఇప్పుడు చంద్రబాబు దీని పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు సిద్దమైతే పొత్తు అధికారికం కావటం లాంఛనమే.

జనసేన బలిపశువు కాబోదు
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రధానంగా సామాజిక సమీకరణాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసారు. తాను టీడీపీతో పొత్తుకు సిద్దం అవుతున్న వేళ.. కాపు వర్గాన్ని తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెడుతున్నాననే వైసీపీ విమర్శలకే ఎక్కువగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాను టీడీపీతో పొత్తుకు దారి తీస్తున్న పరిస్థితులను పరోక్షంగా సుదీర్ఘంగా వివరించారు. పదేళ్ల విలువైన సమయం తాను పార్టీ కోసం ఏ విధంగా ఖర్చు చేసిందీ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని పవన్ స్పష్టం చేసారు. తనతో సహా జనసేన తరఫున నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారని ధీమా వ్యక్తం చేసారు. ఓటు ఈ సారి వృథా కాదని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన సంతకం ఉంటుందని స్పష్టం చేసారు. అయితే, 175 స్థానాల్లో పోటీచేయాలనే వైసీపీ డిమాండ్ ను ప్రస్తావించిన పవన్.. ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది మాత్రం వెల్లడించలేదు. 20 స్థానాలు టీడీపీతో ఒప్పందం అనే ప్రచారంలో మాత్రం వాస్తవం లేదన్నారు.

బీజేపీకి గుడ్ బై చెప్పినట్లేనా..
పవన్ పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వంతో జరిగిన చర్చలు..ప్రణాళిక అమలు చేసి ఉంటే ఇప్పుడు టీడీపీ ప్రస్తావన ఉండేది కాదని తేల్చి చెప్పారు. పరోక్షంగా తాను ఇప్పుడు టీడీపీ వైపు వెళ్లటానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కారణమనే విషయాన్ని పవన్ స్పష్టం చేసారు. అమరావతి రాజధాని వ్యవహారం పైన ఒక లాంగ్ మార్చ్ పెడతాం అని తాను చెప్పగా.. అందుకు ఢిల్లీలో ఒప్పుకున్నారన్నారు. సాయంత్రానికి అదేంలేదని అన్నారని... కలిసికట్టుగా కార్యక్రమాలు నడపకపోతే తానేం చేయాలని పవన్ ప్రశ్నించారు. వారు చేయరు..తనను చేయనీయరు అనే విధంగా పరిస్థితి మారిందన్నారు. చేయనివ్వరు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వివరించారు. దీని ద్వారా తాను బీజేపీకి దూరం అయి..టీడీపీకి దగ్గరవుతున్న సంకేతాలను పవన్ స్పష్టంగా ఇచ్చినట్లు కనిపిస్తోంది.

టీడీపీతోనే కలిసి..అక్కడే ట్విస్ట్
వైసీపీ కోరుకుంటోంది జరగదని పవన్ చెప్పారు. దీని ద్వారా తాను టీడీపీతో జత కట్టటం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో తనను నమ్మమని..తనకు అవకాశం ఇవ్వమని పదే పదే కోరారు. అభిమానులు..జనసైనికులు ఏం కోరుకుంటున్నారో తెలుసని..అదే జరుగుతుందని హామీ ఇచ్చారు. టీడీపీ మీద తనకు ప్రత్యేక ప్రేమ లేదన్నారు. చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదని చెప్పారు. కానీ... ఆయనమీద గౌరవముంది. ఆయన సమర్థుడని పవన్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా పొత్తుతో వెళ్తూనే..సీట్లు- అధికారంలో పవన్ తగిన ప్రాధాన్యత కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. జనసైనికులు ఏం కోరుకుంటున్నారో (పవన్ సీఎం కావాలనేదే అభిమానుల కోరిక) అని చెప్పటం ద్వారా...అధికారంలో షేరింగ్ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తే పొత్తు ఖాయమనే విధంగా పవన్ తేల్చేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..ఇప్పుడు సీట్లు - పవర్ షేరింగ్ పైన టీడీపీ నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా పొత్తుపై ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications