పవన్ కళ్యాణ్ పార్టీ ఖాయం, ట్యాగ్‌లైన్ ప్రశ్నించడానికే
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నట్లు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ద్రువీకరించారు. కానీ కేవలం తొమ్మిది ఎంపీ, 40 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే తన అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలుపుతారని చెప్పారు. పవన్ పార్టీ పెట్టేది పవర్ కోసం కాదని, ప్రశ్నించడం కోసమని స్పష్టం చేశారు. గురువారం ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
తన రాజకీయాల ఎంట్రీ గురించి మరో వారంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించనున్నట్లు తెలుస్తోంది.. ఈనెల 12న లేదా 15న పవన్ మీడియా సమావేశం ఉంటుందని తెలుస్తోంది. దీనికి జాతీయ మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 45 నిమిషాల నుంచి గంటపాటు మాట్లాడేందుకు వీలుగా పవన్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఒక హాలు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజున హైదరాబాద్‌కు రావాల్సిందిగా పవన్ అభిమాన సంఘాల ప్రతినిధులకు సమాచారం వెళ్లింది. సన్నిహితులు, అభిమానులు పాల్గొనే ఈ సమావేశంలో వేదికపై మాత్రం పవన్ ఒక్కరే ఉంటారని తెలుస్తోంది. వారందరి సమక్షంలోనే పవన్ తన రాజకీయ పార్టీపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను పుస్తకంగా రాసినట్లు తెలుస్తోంది. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications