అసెంబ్లీ గేట్‌ను టచ్ చేయనివ్వం అన్నారుగా
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు.
ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య గురువారం సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన ప్రమాణం చేయించారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో అందరికంటే సీనియర్ అయిన శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీ.

శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ శాసనమండలికి నామినేట్ అయ్యారు.
పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తరువాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నారు పవన్. అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో. 2014 మార్చి 10వ తేదీన జనసేన ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం- బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు గానీ ఎన్నికల బరిలో దిగలేదు పవన్ గానీ, ఆ పార్టీ అభ్యర్థులు గానీ.
సీపీఐ, సీపీఎం, బహుజన్ సమాజ్‌వాది పార్టీలతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు గానీ చేదు ఫలితం ఎదురైంది. ఆ ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు.

అయిదు సంవత్సరాలు తిరిగే సరికి పవన్ ప్రభంజనం కనిపించింది. టీడీపీ- బీజేపీతో కలిసి రంగంలో దిగారు. పోటీ చేసిన 21 స్థానాల్లో తిరుగులేని మెజారీటీతో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురంలో విజయఢంకా మోగించారు. తొలిసారే ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.
పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అవేవీ ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. అలా హెచ్చరించిన ఆ పార్టీ నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అలాంటి అవమానాలు, అడ్డంకులను దాటుకుని పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతోండటం జనసేన క్యాడర్‌లో జోష్ నింపింది.












Click it and Unblock the Notifications