పవన్ కల్యాణ్ నియోజకవర్గం ఖరారు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. పార్టీ ఏర్పాటైన 10 సంవత్సరాలకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారని, తమను విమర్శించేముందు ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పుడు విమర్శించాలంటూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తుండటంతో నియోజకవర్గంపై సీరియస్ గా దృష్టిసారించారు.

పూర్తిస్థాయిలో సర్వే చేస్తున్న సంస్థ
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే ఇక్కడ పోటీచేయడానికి ముందస్తుగా ఎటువంటి సన్నాహాలు చేసుకోలేదు.. గ్రౌండ్ వర్క్ చేయలేదు. నేరుగా వచ్చి పోటీచేశారు. తక్కువ మెజారిటీతో రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. ఈసారి అలాకాకుండా ముందునుంచే ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే విషయంపై దృష్టిసారించారు. నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఏమిటి? కాపు ఓటర్లు ఎంతమంది ఉంటారు? అభిమానులు ఎంతమంది? ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ బలమెంత? ఏ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీచేసే అవకాశం ఉంది? తదితర విషయాలన్నింటిపై ఒక సర్వే సంస్థకు బాధ్యత అప్పగించారు. దీనిపై ఆ సంస్థ సర్వే చేస్తోంది.

అభిమానులను ఓటర్లుగా మలచుకునే దిశగా..
అభిమానులను ఓటర్లుగా ఎలా మార్చుకోవాలనే అంశంపై కూడా సర్వే జరుగుతోంది. రెండు నియోజకవర్గాలకన్నా ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయడం మంచిదనే భావనలో పవన్ ఉన్నారు. ఈసారి రెండు నియోజకవర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అవి కాకినాడ రూరల్, తిరుపతి. రెండో ప్రాధాన్యత కింద పిఠాపురం నియోజకవర్గాన్ని చేర్చారు. తిరుపతిలో అభిమానుల బలంతోపాటు సామాజికవర్గ బలం కూడా ఉంది. గతంలోప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కూడా చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి పోటీచేసి ఓటమిపాలైనప్పటికీ తిరుపతి నుంచి ఘనవిజయం సాధించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిపై ఆలోచన చేస్తున్నారు.

ఈ మూడింటిలో ఒకటి ఖరారు?
అలాగే కాకినాడ రూరల్ లో అభిమానుల బలంతోపాటు సామాజికవర్గ బలం తోడైతే విజయం నల్లేరుపై నడక లాంటిదేనని జనసేన నాయకులు భావిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత పిఠాపురం నుంచి పోటీచేయాలంటూ ఆహ్వానాలు వస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ ఏ విషయం తేల్చిచెప్పడంలేదు. పిఠాపురంలోని ఓటర్ల సంఖ్యలో 80 శాతం కాపు సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 25వేలకు పైగా ఓటింగ్ వచ్చింది. వైసీపీ నుంచి ఈసారి ఇక్కడ కాకినాడ ఎంపీ గీత పోటీచేస్తుందని భావిస్తున్నారు. కచ్చితంగా గెలిచే నియోజకవర్గాన్ని ఈ మూడింటిలో ఒకదాన్ని ఖరారు చేయబోతున్నారు. తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. అలాగే పొత్తులపై కూడా త్వరలోనే జనసేన తేల్చేయబోతోంది.












Click it and Unblock the Notifications