కాసేపట్లో జనసేన ముఖ్య నేతలతో పవన్ భేటీ-భవిష్యత్ కార్యాచరణపై చర్చ-విజయవాడకు!
ఏపీలో వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన, అనంతర పరిస్ధితుల్లో మంత్రులపై జనసేన నేతల దాడులు, పవన్ కళ్యాణ్ పై పోలీసుల ఆంక్షలు, జనసేన నేతల అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే విశాఖలోని నోవాటెల్ హోటల్ కు చేరుకుని అక్కడి నుంచే పరిస్దితి సమీక్షిస్తున్న పవన్ కళ్యాణ్.. తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఇవాళ కీలక నేతలతో భేటీ కాబోతున్నారు.
వైజాగ్ నోవోటెల్ హోటల్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే చంద్రబాబు, సోము వీర్రాజు సహా పలు పార్టీల అధినేతలు, నేతలు ఫోన్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేస్తున్నారు. అదే సమయంలో నోవోటెల్ హోటల్ బయట జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా గుమికూడుతున్నారు. వారిని అక్కడి నుంచి తరలించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. జనసేన నేతల్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు వెళ్లిన సమయంలోనూ అక్కడకు కూడా చేరుకున్న జనసేన నేతలు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఆయన వద్ద పార్టీ నంబర్ టూ నాదెండ్ల మనోహర్ తో పాటు పవన్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారు. వీరితో పాటు జనసేన పీఏసీ నేతలు కూడా విశాఖ వస్తున్నారు. వీరితో భేటీ అయి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు పవన్ సిద్దమవుతున్నారు. ఇందులో గవర్నర్‌ని కలిసే అంశాన్ని జనసేన పరిశీలిస్తోంది. పవన్ విజయవాడ వెళ్లేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేతలతో పవ్న భేటీ తర్వాత దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications