ఎవర్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకున్న జగన్
Peddireddy Ramachandra Reddy: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బెడదను ఎదుర్కొంటోంది. వలసల తాకిడి అధికమైంది. ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేసే స్థితికి తీసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసబాట పట్టారు.
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు.. పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు.

ఏలూరు, జగ్గయ్యపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనల్లో జాయిన్ అయ్యారు. ఈ వలసలు ఇప్పట్లో ఆగేలానూ కనిపించట్లేదు. మున్ముందు మరి కొందరు పార్టీని వీడొచ్చంటూ వార్తలొస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన వారి సేవలనూ వినియోగించుకుంటోంది.
ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకూ స్థానచలనం కల్పించింది. అలాగే- పార్టీ అనుబంధ విభాగాల్లో సైతం భారీగా మార్పులు చేర్పులు చేసింది. పలు విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జీలను అపాయింట్ చేసింది.
తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించారు వైఎస్ జగన్. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా పెద్దిరెడ్డిని నియమించారు. దీనితో పాటు చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పార్టీ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక హోదాల్లో పని చేసిన విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఆయనా ఒకరు.












Click it and Unblock the Notifications