అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కంచె..?!
తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. 48 గంటల వ్యవధిలో శేషాచలం అడవుల్లో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు.
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఉదంతం అనంతరం టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతల సంచారంపై దృష్టి సారించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి కదలికపై నిఘా ఉంచారు.
శేషాచలం అడవుల్లో చిరుతల సంచారం తీవ్రతరం కావడం పట్ల అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కాలి నడకన వెళ్లే భక్తులు ఎదుర్కొంటోన్న చిరుతల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. తిరుమలకు కాలినడకన వెళ్లే అన్ని మార్గాల్లో కంచె వేసే ఆలోచన చేస్తామని, దీనిపై నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటామని అన్నారు.

ఈ మధ్యాహ్నం ఆయన తిరుపతిలో పర్యావరణ భవన్‌ను ప్రారంభించారు. తిరుమల నడకదారిలో చిరుతల దాడులు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటీవల చిరుత దాడిలో లక్షిత అనే ఆరేళ్ల బాలిక మరణించడం దురదృష్టకరమని పెద్దిరెడ్డి అన్నారు. బాలిక కుటుంబానికి అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని అందించామని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు దొరికిన రెండు చిరుతలను ప్రస్తుతానికి శ్రీవేంకటేశ్వర జూ పార్క్‌కు తరలించామని, అక్కడే వాటిని సంరక్షిస్తామని పెద్దిరెడ్డి వివరించారు. భక్తుల సంరక్షణ కోసం టీటీడీ అధికారులు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోన్నారని, ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications