త్వరలో నరసాపురానికి రఘురామ: తేల్చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ
అమరావతి/న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నేతగా ముద్రపడిన నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. సుదీర్ఘకాలంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉంటోన్నారు. దేశ రాజధానిలోనే ఉంటోన్నారు. అక్కడి నుంచే ప్రతిరోజూ రచ్చబండ పేరుతో ఏపీ రాజకీయాలపై విలేకరుల సమావేశాలను నిర్వహిస్తోన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకుని తన నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సైతం విమర్శలు గుప్పిస్తోన్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆయన రోజువారీ దినచర్యగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై నిత్యం నిప్పులు చెరుగుతుంటారాయన.

రాష్ట్రంలో రఘురామపై పలు కేసులు నమోదయ్యాయి. వేర్వేరు సంఘటనల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర దళిత, ప్రజా సంఘాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఆయనపై కేసులు పెట్టారు. మొత్తంగా వివిధ పోలీస్ స్టేషన్లల్లో 11 ఎఫ్ఐఆర్‌లు రఘురామపై నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంలో ఉన్నారు రఘురామ కృష్ణంరాజు.
అందుకే తన నియోజకవర్గానికి దూరంగా ఉంటోన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి నాడు తాను ఏపీకి వస్తానంటూ గతంలో ప్రకటించినప్పటికీ.. అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. స్టుపిడ్ రాజకీయాల వల్లే తాను సొంత రాష్ట్రానికి రాలేకపోతున్నానంటూ అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా మరోసారి అలాంటి ప్రకటనే చేశారు. త్వరలో సొంత నియోజకవర్గానికి వస్తాననీ అన్నారు. సుదీర్ఘకాలంగా తన కోసం నరసాపురం ఓటర్లు ఎదురు చూస్తోన్నారని, వారి కోరికను త్వరలోనే నెరవేరుస్తానని చెప్పారు. నరసాపురానికి చెందిన పలువురు స్థానికులు ఇవ్వాళ ఢిల్లీలో రఘురామ కృష్ణంరాజును కలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో ప్రారంభమైన గంగా పుష్కరాల్లో పాల్గొనడానికి నరసాపురం నుంచి బయలుదేరి వెళ్లారు వారంతా.
ఢిల్లీలో దిగిన తరువాత నేరుగా రఘురామ ఇంటికి వెళ్లారు. వారిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. త్వరలోనే నరసాపురానికి వస్తానని, అక్కడికి రావాల్సిన అవసరం కూడా ఏర్పడిందని రఘురామ వ్యాఖ్యానించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించిన ఓటర్లకు దూరంగా ఉండాల్సి రావడం బాధాకరమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications