కలవనని బాబు ప్రతిజ్ఞ!: కారులో పొగలు, తప్పినముప్పు
న్యూఢిల్లీ: తెలుగు జాతిని అవమానిస్తున్న ప్రధాని మన్మోహన్‌ను ఇక మీదట తాను కలిసేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. కష్టనష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలు, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరేందుకు అపాయింట్‌మెంట్ అడిగినా, నిరాకరించిన ప్రధాని వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్‌కు గతంలో ఎన్టీఆర్ గుణపాఠం చెప్పినట్టు, ప్రజలను ఉద్యమబాటన నడిపించి చరిత్ర పునరావృతం చేసేంత వరకూ తెదేపా విశ్రమించదని ప్రతిజ్ఞ చేశారు. తెలుగువారంటే లేక్కలేకుండా పోయింది. తెలుగు ప్రజాప్రతినిధులంటే విలువే లేకుండాపోయింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తెలుగువారికి జరుగుతోన్న అన్యాయాన్ని వివరించి, న్యాయం చేయాల్సిందిగా కోరేందుకు నాలుగురోజులుగా నిరీక్షిస్తున్నా పట్టించుకోని ప్రధానిని తానూ ఇకనుంచి లెక్కచేయనని చంద్రబాబు స్పష్టం చేశారు.

కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంపై తెదేపా బృందం ఢిల్లీకి వచ్చింది. ప్రధానితో అపాయింట్‌మెంట్ కోరుతూ, ఢిల్లీకి రాక మునుపే లేఖ కూడా పంపారు. ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రధాని ఎగవేయటంపై బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ప్రధాని కాబట్టి అపాయింట్‌మెంట్ అడిగామే తప్పించి, మీరు ఆ పదవిలో లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు.
బాబుకు తప్పిన ప్రమాదం
చంద్రబాబుకు ఢిల్లీలో తృటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు యనమల రామకృష్ణుడుతో కలిసి హైదరాబాదు వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరారు. మధ్యలో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు లోపల పేలుడు శబ్ధంతో పొగలు వచ్చాయి. ఆ సమయంలో కారు అత్యంత వేగంగా వెళ్తోంది. డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు ఆపి, ముందు భాగంలోని బ్యానెట్ ఎత్తగానే మంటలు ఎగిసిపడ్డాయి. బాబు, యనమలలు వెంటనే కారు నుండి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.












Click it and Unblock the Notifications