మోడీ సభకు కత్తులతో: పవన్‌కు ట్రాఫిక్ చిక్కు, ఆలస్యం
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభకు కత్తులతో వచ్చే ప్రయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో మోడీ సభ జరిగిన విషయం తెలిసిందే.
ఎల్బీ స్టేడియం గేట్ల వద్ద కత్తులతో లోనికి వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వైపు ఉన్న ఆరో నెంబర్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి దగ్గర కత్తి బయటపడింది. అథనితో పాటు వచ్చిన మరో వ్యక్తి వద్ద మరో కత్తి దొరికింది.

పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. మోడీ సభపై నిఘావర్గాల హెచ్చరిక ఉన్న విషయం తెలిసిందే. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సభకు వచ్చే వారికి మంచినీళ్ల బాటిళ్లు, సంచులు.. తదితరాలతో స్టేడియంలోకి అనుమతించేది లేదని పోలీసులు ముందే చెప్పారు.
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ సభలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాగా, పవన్ కల్యాణ్ ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో ఎల్బీ స్టేడియం సభకు ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.












Click it and Unblock the Notifications