బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరుగా.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి.
బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. వచ్చే 24 గంటల్లో ఇది బలపడుతుందని, అల్పపడీనంగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు తూర్పు గోదావరి జిల్లా నాగంపల్లిలో అత్యధికంగా 49 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్- 37.7, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ల- 36.5, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం- 35.7, విశాఖ జిల్లా ఎండాడ- 35.7, సీతమ్మధార- 35.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. వాయవ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు చెదురు మదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
నేడు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక వర్షాలు కురిస్తాయని ప్రఖర్ జైన్ చెప్పారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications