జెండా కూలీగా ఉండలేను.. జనసేన నేత షాకింగ్ కామెంట్స్
ఏపీలో కూటమి టికెట్ల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన మాత్రం తమకు కేటాయించిన 21 స్థానాలకుగాను 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి.. మరో రెండు స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినప్పటికీ ఆయా పార్టీల్లో అసంతృప్తి మాత్రం ఇంకా వ్యక్తం అవుతూనే ఉంది. టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో కాకరేపుతోంది.
దీనిలో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అసమ్మతి మరోసారి బయటపడింది. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు బీజేపీ దక్కించుకుంది. సుజనా చౌదరి పేరును బీజేపీ అధిష్టానం ఖాారారు చేసింది. అయితే దీనిపై జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ జనసేన నాయకుడు పోతిన మహేష్ బీజేపీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పోతిన మహేష్‌కు ఎమ్మెల్యే సీటు వస్తుందని పవన్ హామీ ఇవ్వడంతో ..ఆయన నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి జనసేనను బలోపేతం చేశారు. అయితే టికెట్ సుజనా చౌదరికి దక్కడంతో పోతిన మహేష్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా దీనిపైన మాట్లాడిన పోతిన మహేష్.. తాను పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు మొదటి జాబితాలో నీ పేరు ప్రకటించలేకపోయామని.. రెండో జాబితాలో నా పేరు ఉంటుందని పవన్ కల్యాణే స్వయంగా తెలిపారని పోతిన మహేష్ పేర్కొన్నారు.
తీరా తన సీటును వేరే వ్యక్తికి ఖారారు చేశారని.. ఇది అన్యాయమని ఆయన వాపోయారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాను బలంగా పని చేశానని.. అయిన కూడా తనకు సీటు దక్కలేదని.. తెర వెనుక ఏం జరిగిందో తెలియదని పోతిన మహేష్ చెప్పారు.బలమైన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలి.. ఎవరి కోసం త్యాగం చేయాలని పార్టీ అధినేతను పోతిన మహేష్ ప్రశ్నించారు. ఎవరి కోసమో తాను జెండా కూలిగా మారబోనని పోతిన మహేష్ స్పష్టం చేశారు.
ప్రతికూల పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌తో ఉన్నామని..2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చాలామంది జనసేనను విడిచి వెళ్లిపోయారని.. అయినా కూడా తాను జనసేనలోనే ఉండి పార్టీని బలోపేతం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. మాలాంటి వ్యక్తులకు ఈ రోజున రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications