కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! పవన్ కల్యాణ్‌కు మరో కౌంటర్
నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. లడ్డూ వ్యవహరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలిపారని ఆరోణలు రావడంతో హిందువలంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు.అప్పటి నుంచి ప్రతిరోజు పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ప్రకాష్ రాజ్. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. 'దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్' అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. ''కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. ... ఇక చాలు... ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి'' అంటూ పవన్ కల్యాణ్‌పై సైటెర్స్ వేశారు. అయితే తన ట్వీట్‌లో ఎక్కడా కూడా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ ఆ ట్వీట్ చూస్తే మాత్రం పవన్‌ను ఉద్దేశించే చేశారని అర్థం అవుతోంది.

ఇక లడ్డూ వివాదంపై వైసీపీ నాయకులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ ఉన్నత న్యాయస్థానం సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసింది. మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లడ్డూ వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా ఘజియాబాద్ ల్యాబ్ ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు సర్కార్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో లడ్డూ వివాదంలో చంద్రబాబే తొందరపడి వ్యాఖ్యలు చేసినట్టు అయిందని సుప్రీంకోర్టు తేల్చినట్టు అయింది. దీంతో సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే #CBNShouldApologizeToHindus అనే ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications