పోలవరం షాక్: రాష్ట్రపతి సంతకం, ఆ మండలాలివే..
న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా పోలవరంలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్డినెన్స్ ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం నాటి కేబినెట్ భేటీలో ఆమోదించడం, ఆ తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలువనున్నారు.
కాగా, ఈ ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని చింతూరు, భద్రాచలం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్కంపాడు, పీఆర్ పురం మండలాలు సీమాంధ్రలో కలవనున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజైన మంగళవారం తొలి కేబినెట్ జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

అందులో పొలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం... ఆ విషయం బయటకు రాలేదు. నిన్న సాయంత్రం కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో కూడా ఈ విషయం వెల్లడించలేదు. అయితే నిన్ననే ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారు. దీనిపై ఈరోజు ప్రణబముఖర్జీ ఆమోద ముద్ర వేశారు.
కేంద్రం తలొగ్గింది: హరీష్ రావు
సీమాంధ్ర ప్రాంత నేతల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు హైదరాబాదులో బుధవారం అన్నారు.
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం అన్యాయమన్నారు. దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ఇది విశ్రాంతి తీసుకునే సమనయం కాదన్నారు. అవసరమనైతే సుప్రీంకు వెళ్తామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ నేతలతో హరీష్ రావు సాయంత్రం భేటీ అయ్యారు. కెసిఆర్ ప్రమాణ స్వీకారం, తెలంగాణ ఆవిర్భావ దినం ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications