జగన్ కు రఘురామ అభినందనలు : మాట తప్పరు..మడమ తిప్పరనే నమ్మకం : సీఎంను ఇరకాటంలో పెట్టేలా...!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖలు కొనసాగుతున్నాయి. తాజా గా రాసిన లేఖలో రఘురామ రాజు ముఖ్యమంత్రికి మండలిలో పూర్తి మెజార్టీ సాధించినందుకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో 2020, జనవరి 27న మూడు బిల్లుల తిరస్కరణ కారణంగా మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీలో శాసన మండలి రద్దు తీర్మానం చేసారని గుర్తు చేసారు. మీరు ఎప్పుడూ మాట తప్పరు..మడమ తిప్పరని మీ అభిమానులు నమ్ముతారంటూ లేఖలో పేర్కొన్నారు.

మండలి రద్దు విషయంలో వెనుకడుగు వద్దు..
మండలి రద్దు సమయంలో సీఎంగా మండలిలో ఖర్చు గురించి.. ప్రజలకు ఉపయోగం లేదంటూ చేసిన ప్రసంగాన్ని సాధారణ ప్రజలు నమ్మారంటూ చెప్పుకొచ్చారు. ప్రతీ ఏటా మండలి నిర్వహణ కోసం రూ 60 కోట్లు ఖర్చు చేయటం సబబా అంటూ నాడు ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేసారు. కొంత మంది ప్రత్యర్ధులు జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు మీ విమాన ఛార్జీలు రూ 26 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ప్రశ్నిస్తున్నారని రాసుకొచ్చారు. దీంతో..ఇప్పుడు మండలిలో పూర్తి మెజార్టీ సాధించిన సమయంలో అక్కడ కూడా మండలి రద్దు తీర్మానం చేయాల్సందిగా కోరండంటూ ముఖ్యమంత్రికి సూచించారు.

మెజార్టీ ఉన్నప్పుడే చేస్తేనే నమ్ముతారు
మండలిలో మెజార్టీ లేని సమయంలో చేసిన తీర్మానం..చెప్పిన మాటలు నమ్మాలంటే ఇప్పుడు మెజార్టీ వచ్చిన తరువాత అమలు చేయాలని... అప్పుడే మీ చిత్తశుద్ది నమ్ముతారంటూ రఘురామ లేఖలో పేర్కొన్నారు. మండలి రద్దు గురించి ఏపీ ప్రభుత్వం చేసిన తీర్మానం అమలయ్యేలా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని గతంలో మీరు సూచించిన విధంగానే..జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశంలో ప్రయత్నించాలని కోరారు. ఏపీకి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలను క్లియర్ చేయటం కోసం ఎంపీలంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సీఎంను ఇరకాటంలో పెట్టేందుకేనా..
ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం పైన మండలి ఏర్పాటు చేయాలన్నా..రద్దు చేయాలన్నా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని లేఖలో వివరించారు. ఇక, రఘురామ రాజు వరుసగా రాస్తున్న లేఖల పైన ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరూ స్పందించటం లేదు. అయితే, వ్యూహాత్మకంగా మండలి విషయంలో జగన్ ను పరోక్షంగా కార్నర్ చేసే ఉద్దేశంతోనే రఘురామ రాజు ఈ లేఖ రాసినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications