విశాఖ - తిరుపతి వందేభారత్ వచ్చేస్తోంది : మరో రైలుకూ పచ్చ జెండా..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ సిద్దం అవుతోంది. ఇప్పటికే కొనసాగుతున్న రెండు వందేభారత్ రైళ్లతో పాటుగా మరో మూడు రైళ్లకు గతంలోనే రైల్వే శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూడు రైళ్లకు సంబంధించి ట్రయిల్ రన్ పూర్తి చేసారు. విశాఖకు మరో రెండు వందేభారత్ రైళ్ల రాకపోకలకు వీలుగా రంగం సిద్దం అవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఇవి పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.
మరో వందేభారత్ సిద్దం
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండో రైలు ప్రారంభమైంది. ఆ సమయంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరిన్ని వందేభారత్ రైళ్ల ఏర్పాటు పైన ప్రతిపాదనలు వచ్చాయి. మూడు రైళ్ల కేటాయింపుకు రైల్వే శాఖ సూత్ర ప్రాయంగా ఆమోదం లభించింది.

ప్రయాణీకులు రద్దీ.. అవసరమైన మార్గాల పైన నివేదికలు సేకరించింది. అందులో భాగంగా కాచిగూడ - బెంగళూరు, విజయవాడ- చెన్నై మార్గాల్లో కొత్తగా వందేభారత్ కు ఆమోద ముద్ర లభించింది. తాజాగా, విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా వందేభారత్ సర్వీసును ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.
విశాఖ - తిరుపతి మధ్య
విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ కు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో, విశాఖ నుంచి తిరుపతికి మరో వందేభారత్ ప్రారంభించాలనే ప్రతిపాదనలు అందాయి. విశాఖ నుంచి తిరుపతికి నిత్యం తొమ్మది సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో వెయిటింగ్ లిస్టు ప్రతీ రోజు సాధారణంగా మారింది.
ఈ సమయంలో విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ ప్రారంభం ద్వారా ప్రయోజనం ఉంటుందని అధికారులు భావించారు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ మార్గంలోనే విశాఖ నుంచి రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్లేలా ఈ రూట్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో 12 గంటల వరకు ప్రయాణ సమయం తీసుకుంటోంది.
రెండు రైళ్ల ప్రారంభానికి కసరత్తు
ఈ మార్గంలో వందేభారత్ తీసుకురావటం ద్వారా 10 గంటల్లోనే గమ్య స్థానం చేరుకొనే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా చెన్నై నుంచి విశాఖకు 16 కోచ్ ల వందేభారత్ రేక్ చేరుకుంది. ఇదే సమయంలో కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ కూడా ప్రారంభానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ట్రయిల్ రన్ పూర్తి చేసారు.
అటు ఒడిశా నుంచి అభ్యర్దన మేరకు భువనేశ్వర్ - విశాఖ మధ్య వందేభారత్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారిక ఆమోదం రావాల్సి ఉంది. దీంతో, రానున్న రెండు నెలల కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications