తిరుపతి-షిర్డీకి కొత్త రైలు, చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ - రూట్..షెడ్యూల్..!!
రైల్వే శాఖ తిరుపతి, షిర్డీ ప్రయాణీకులకు కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుపతి - షిర్డీ మధ్య కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా చర్లపల్లి నుంచి తిరుపతి, నర్సాపూర్ తో పాటుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇండిగో విమానాల సమస్య కారణంగా ముంబాయి, చెన్నై వంటి ప్రాంతాలకు అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇక.. తిరుపతి - షిర్డీ కొత్త రైలు రూట్.. షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.
తిరుపతి - సాయినగర్ షిర్డీ - తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (17425/17426) రైల్వే శాఖ ప్రకటించింది. డిసెంబర్ 14వ తేదీ నుంచి ఈ రైలు ప్రతీ ఆదివారం అందుబాటులోకి రానుంది. అయితే ప్రారంభ రైలు సర్వీసును డిసెంబర్ 9న నడపనున్నారు. డిసెంబర్ 9న తిరుపతి సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (07425) రైలు నడపనున్నారు. డిసెంబర్ 10వ తేదీన సాయినగర్ షిర్డీ - తిరుపతి (07426) ప్రారంభ రైలు సర్వీసును నడపనున్నారు. తిరుపతి -సాయినగర్ -షిర్డీ తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది.

సోమవారం రోజున షిర్డీ నుంచి తిరుపతికి (17426) తిరిగి బయల్దేరుతుంది. తిరుపతి సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు,ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, గంగాఖేర్, పర్భాని, సేలు, జల్నా, శంభాజీనగర్, నాగర్ సోల్, మన్మడ్, కోపర్ గావ్ రైల్వేస్టేషన్ల మీదుగా సాయినగర్ షిరిడీకి చేరుకుంటుంది.
కాగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి, 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు రైళ్లు బయలుదేరతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్న రైలుకు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్, రేణిగుంటస్టేష్లన్లలో, నర్సపూర్ వెళ్తున్న రైలుకు నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications