అమరావతికి కేంద్రం వరాలు
Amaravati: రాష్ట్రంలో కొలువుదీరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. గతంలో కంటే భిన్నంగా.. ఈ దఫా అమరావతికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.
2014- 2019 మధ్యకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇదే ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం తెలిసిందే. రాజధానిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పట్లో మట్టి, నీళ్లను ఇచ్చి వెళ్లిపోయారు.

అప్పట్లో ఈ ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారి తీసింది. కనీసం 100 కోట్ల రూపాయలను అప్పటికప్పుడు అమరావతి నిర్మాణానికి మోదీ ప్రకటిస్తారని ఆశించినప్పటి.. అలా జరగలేదు. దీనితో విమర్శలు తలెత్తాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా టీడీపీయేతర పార్టీలన్నీ ఆరోపణలను సంధించాయి.
ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బొటాబొటి మెజారిటీని సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం.. అయిదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలనుకుంటే తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) మద్దతు అత్యవసరం. ఈ రెండింటినీ కాదని ఏదీ చేయలేని స్థితిలో ఉంది బీజేపీ. సొంతంగా ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం కూడా బీజేపీకి లేదు.

ఫలితంగా రాజధాని అమరావతి నిర్మాణంపై తన వైఖరిని మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఇందులో భాగంగా- ఇక్కడ లాజిస్టిక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నంబూరు-అమరావతి-ఎర్రుపాలెం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నంబూరు-ఎర్రుపాలెం మధ్య దూరం 56.53 కిలోమీటర్లు. కొత్త లైన్ నిర్మాణానికి 2,600 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది రైల్వే బోర్డ్. నంబూరు నుంచి కొప్పురావూరు, తాడికొండ, అమరావతి, వడ్డెమాన్, కొత్తపేట, పరిటాల, గొట్టిముక్కుల, చిన్నారావుపేట్, పెద్దాపురం మీదుగా ఎర్రుపాలెం వరకు ఈ లైన్ వేస్తారు.












Click it and Unblock the Notifications